కాకినాడలో జరిగిన ‘భారతీయం’ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. మార్కులు తక్కువగా వచ్చాయని, అనుకున్నది సాధించలేకపోయామని బాధపడుతూ తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని విద్యార్థులకు సూచించారు. వైఫల్యాలు విజయానికి తొలి మెట్లని పేర్కొన్న ఆయన.. తాను కూడా 2019 ఎన్నికల్లో ఓటమిని ఎదుర్కొన్నానని గుర్తుచేశారు.

విద్యార్థులు మరింత సున్నితంగా మారుతున్న తీరు ఆందోళన కలిగిస్తోందన్న లోకేశ్.. రంపచోడవరానికి చెందిన పదో తరగతి విద్యార్థి ఆత్మహత్య ఘటన తనను తీవ్రంగా కలచివేసిందన్నారు. చాగంటి కోటేశ్వరరావు సమక్షంలో జరిగిన కార్యక్రమంలో దేశభక్తి, ఓర్పు, సహనం, నైతిక విలువల ప్రాధాన్యాన్ని విద్యార్థులకు వివరించారు.

తాను స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ చదివిన సమయంలో ఎదురైన అనుభవాలను లోకేశ్ పంచుకున్నారు. రెండు సంవత్సరాల కోర్సులో 30 పరీక్షలు రాసినట్లు తెలిపారు. పరీక్షల సమయంలో ఇన్విజిలేటర్ లేకుండా విద్యార్థులపై విశ్వాసంతో పరీక్షలు నిర్వహించేవారని, ఇది బాధ్యతకు గొప్ప ఉదాహరణ అని పేర్కొన్నారు.

జీవితంలో విలువలను ఎప్పటికీ మర్చిపోవద్దని, షార్ట్‌కట్ మార్గాలను ఆశ్రయించవద్దని సూచించారు. దక్షిణ కొరియా, సింగపూర్, తైవాన్ వంటి దేశాలు తరతరాల త్యాగాలు, కృషితో అభివృద్ధి సాధించాయని చెప్పారు. భారత్ కూడా అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలని, అయితే ఆ అభివృద్ధి విలువలతో కూడి ఉండాలని ఆకాంక్షించారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని గుర్తుచేశారు.

దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో విధులు నిర్వహించే సైనికులు నిజమైన హీరోలని లోకేశ్ అన్నారు. కార్గిల్ యుద్ధంలో బుల్లెట్ తగిలినా దేశం కోసం పోరాడిన కిరణ్ కుమార్ అనే సైనికుడి గురించి ప్రస్తావించారు. అలాగే ‘ఆపరేషన్ సింధూర్’లో వీరమరణం పొందిన మురళీ నాయక్ త్యాగాన్ని గుర్తుచేస్తూ.. దేశం కోసం ప్రాణాలను అర్పించే సైనికుల పట్ల గౌరవం చూపాలని, జవాన్లు కనిపిస్తే వారికి సెల్యూట్ చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *