ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం గంటగంటకూ బలపడుతోంది. తీరం వెంబడి గంటకు 60 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులు, ఎడతెరిపి లేని కుండపోత వర్షాలతో రాబోయే 72 గంటలు రాష్ట్రం తడిసిముద్దవుతుందని అధికారులు అంచనావేస్తున్నారు. ఏ ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం..

రాగల మూడు రోజుల వాతావరణ హెచ్చరికలు
కోస్తాంధ్ర – యానాం
ఇవాళ పలుచోట్ల మోస్తరు వర్షాలు, ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. మంగళవారం వర్షాల తీవ్రత గణనీయంగా పెరగనుంది. చాలా చోట్ల మోస్తరు వర్షాలతో పాటు, ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే ముప్పు ఉంది. బుధవారం వాయుగుండం తీరానికి చేరువయ్యే క్రమంలో కోస్తాంధ్ర అతలాకుతలం అయ్యే అవకాశం ఉంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన అతి భారీ వర్షాలు కురుస్తాయి. తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో పెనుగాలులు వీచే ప్రమాదం ఉంది.
రాయలసీమ
ఇవాళ పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు, ఒకటి లేదా రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. గంటకు 40-50 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయి. మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కొనసాగుతాయి.
తీరం వెంబడి గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటం, సముద్రం అల్లకల్లోలంగా మారే సూచనలు ఉండటంతో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ విభాగం సూచించింది.
