కశ్మీర్ అందాలను ఆస్వాదించాలనుకునే హైదరాబాద్ వాసుల కోసం IRCTC ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. 5 రాత్రులు, 6 రోజుల ఈ పర్యటనలో శ్రీనగర్‌తో పాటు సోన్మార్గ్, గుల్మార్గ్, పహల్గామ్ వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంటుంది. ఈ ప్యాకేజీ ధరలు రూ.37,510 నుంచి ప్రారంభమవుతున్నాయి. కశ్మీర్ ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే వారికి ఈ టూర్‌లో పలు ఆకర్షణీయమైన ప్రదేశాలను ఒకే ట్రిప్‌లో చూసే అవకాశం లభిస్తుంది.

IRCTC Kashmir Tour Package Telugu: కశ్మీర్‌ అందాలను ఆస్వాదించాలనుకునే హైదరాబాద్‌ వాసులకు IRCTC ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందిస్తోంది. “Mystical Kashmir Ex – Hyderabad” పేరుతో రూపొందించిన ఈ ప్యాకేజీ ద్వారా 5 రాత్రులు, 6 రోజుల పాటు కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. శ్రీనగర్‌తో పాటు సోన్మార్గ్, గుల్మార్గ్, పహల్గామ్ వంటి అందమైన ప్రదేశాలను ఈ పర్యటనలో చూడొచ్చు.

హైదరాబాద్‌ నుంచి కశ్మీర్‌ టూర్ ప్యాకేజీ

ఈ ప్యాకేజీ కోడ్ SHA11. విమాన ప్రయాణంతో కూడిన కంఫర్ట్‌ కేటగిరీలో టూర్‌ను నిర్వహిస్తున్నారు. 2026 అక్టోబర్‌ 12, నవంబర్‌ 21 తేదీల్లో ఈ పర్యటనలు ప్రారంభం కానున్నాయి. ఒక్కో టూర్‌కు మొత్తం 19 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

అక్టోబర్‌ 12న హైదరాబాద్‌ నుంచి ఉదయం 8:30 గంటలకు విమానం బయలుదేరి మధ్యాహ్నం 3:45 గంటలకు శ్రీనగర్‌ చేరుకుంటుంది. అక్టోబర్‌ 17న సాయంత్రం 4:20 గంటలకు శ్రీనగర్‌ నుంచి తిరుగు ప్రయాణం ప్రారంభమై రాత్రి 10:05 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటారు. నవంబర్‌ 26న సాయంత్రం 4:55 గంటలకు శ్రీనగర్‌ నుంచి బయలుదేరి రాత్రి 8:05 గంటలకు హైదరాబాద్‌ చేరుకునేలా షెడ్యూల్‌ ఉంది. అయితే విమాన సమయాల్లో మార్పులు ఉండే అవకాశం ఉందని IRCTC తెలిపింది.

టూర్‌లో ఏయే ప్రాంతాలు సందర్శిస్తారు?

టూర్‌ మొదటి రోజు శ్రీనగర్‌ చేరుకున్న అనంతరం హోటల్‌లో చెక్‌ఇన్‌ చేసి విశ్రాంతి తీసుకుంటారు. రెండో రోజు సోన్మార్గ్‌ పర్యటన ఉంటుంది. మంచుతో కప్పబడిన పర్వతాలు, పచ్చని ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు.

మూడో రోజు గుల్మార్గ్‌ సందర్శన ఉంటుంది. ఇక్కడ ప్రసిద్ధ గుల్మార్గ్‌ గోండోలా రైడ్‌ చేయాలనుకునేవారు సొంత ఖర్చుతో టికెట్లు తీసుకోవచ్చు.

నాలుగో రోజు పహల్గామ్‌ పర్యటనలో సాఫ్రన్‌ ఫీల్డ్స్‌, అవంతిపూర్‌ శిథిలాలను సందర్శిస్తారు. బీటాబ్‌ వ్యాలీ, చందన్‌వారి, అరూ వ్యాలీ వంటి ప్రాంతాలను స్థానిక రవాణా ద్వారా సొంత ఖర్చుతో సందర్శించే అవకాశం ఉంటుంది.

ఐదో రోజు శ్రీనగర్‌కు తిరుగు ప్రయాణంలో శంకరాచార్య ఆలయాన్ని దర్శించుకుంటారు. అనంతరం సాయంత్రం దాల్‌ లేక్‌లో శికారా రైడ్‌ను ఆస్వాదించవచ్చు.

చివరి రోజు మొఘల్‌ గార్డెన్స్‌, బొటానికల్‌ గార్డెన్‌ లేదా షాలిమార్‌ గార్డెన్స్‌లో పర్యటించి, అనంతరం శ్రీనగర్‌ విమానాశ్రయానికి చేరుకుంటారు.

ప్యాకేజీ ధరలు

సింగిల్‌ ఆక్యుపెన్సీకి రూ.44,670, డబుల్‌ ఆక్యుపెన్సీకి రూ.39,070, ట్రిపుల్‌ ఆక్యుపెన్సీకి రూ.37,510గా ప్యాకేజీ ధరలు ఉన్నాయి. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు బెడ్‌తో రూ.30,230, బెడ్‌ లేకుండా రూ.27,870గా ధర నిర్ణయించారు. 2 నుంచి 4 ఏళ్ల పిల్లలకు రూ.27,240గా ప్యాకేజీ ధర ఉంది.

ఈ ప్యాకేజీలో విమాన ప్రయాణం, 5 రాత్రుల హోటల్ వసతి, అల్పాహారం, రాత్రి భోజనం, శికారా రైడ్‌తో పాటు ప్రయాణ బీమా, రవాణా, టోల్, పార్కింగ్, పన్నులు, ప్రవేశ టికెట్లు, టూర్ ఎస్కార్ట్ సేవలు అందుబాటులో ఉంటాయి. అయితే గోండోలా రైడ్, మధ్యాహ్న భోజనం, వ్యక్తిగత ఖర్చులు, స్థానికంగా అవసరమయ్యే రవాణా వంటి అదనపు ఖర్చులను ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *