ఏం తిన్నా ఛాతీలో మంట, పుల్లటి తేన్పులు, కడుపులో అసౌకర్యం వంటి సమస్యలు తరచుగా వేధిస్తుంటే దాన్ని కేవలం అసిడిటీగానే భావించకూడదు. కొన్ని సందర్భాల్లో ఇవి యాసిడ్ రిఫ్లక్స్‌కు సంబంధించిన లక్షణాలు కావచ్చు. అయితే తేలికపాటి రిఫ్లక్స్ లేదా జీర్ణక్రియకు సంబంధించిన అసౌకర్యాన్ని తగ్గించడంలో కొన్ని యోగాసనాలు, శ్వాసాభ్యాసాలు ఉపకరించవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఏం తిన్నా ఛాతీలో మంట, గొంతులో మంట లేదా పుల్లటి తేన్పులు వస్తుంటే చాలామంది దాన్ని అసిడిటీగా భావిస్తుంటారు. అయితే ఇలాంటి లక్షణాలకు ఇతర కారణాలు కూడా ఉండొచ్చు. తేలికపాటి యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాలను నియంత్రించడంలో కొన్ని సులభమైన యోగా పద్ధతులు, శ్వాసాభ్యాసాలు కొంతమందికి ఉపశమనాన్ని అందించవచ్చు. అసిడిటీ సమస్య తరచూ వేధిస్తుంటే మాత్రం వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. ఇంతకీ యాసిడ్ రిఫ్లక్స్ లక్షణాల సమయంలో ఉపశమనానికి ఉపయోగపడే యోగాసనాలు ఏవో తెలుసుకుందాం..
మార్జారియాసనం
వెన్నెముక, పొత్తికడుపు కండరాలకు కదలికను అందించే ఆసనం మార్జారియాసనం. శరీరాన్ని నెమ్మదిగా ముందుకు, వెనక్కి వంచడం వల్ల పొత్తికడుపు ప్రాంతంలో స్వల్పంగా ఒత్తిడి ఏర్పడుతుంది. ఇది శరీరాన్ని రిలాక్స్ చేయడంలో, జీర్ణక్రియకు తోడ్పడటంలో ఉపయోగపడవచ్చు. కొంతమందిలో అసిడిటీతో సంబంధం ఉన్న అసౌకర్యం తగ్గడానికి కూడా తేలికపాటి యోగా సహాయపడవచ్చు.
ఈ ఆసనం ఎలా వేయాలంటే..
- ముందుగా చేతులు, మోకాళ్లపై శరీరాన్ని ఉంచి బల్ల ఆకారంలో ఉండాలి.
- చేతులను భుజాల కింద, మోకాళ్లను తుంటి కింద ఉంచాలి.
- ఊపిరి పీల్చుకుంటూ తలను నెమ్మదిగా పైకి లేపి, ఛాతిని ముందుకు తీసుకురావాలి. వెన్నును స్వల్పంగా కిందికి వంచాలి.
- అనంతరం ఊపిరి వదులుతూ వెన్నును పైకి ఎత్తి, తలను కిందికి వంచాలి.
- ఇలా నెమ్మదిగా కొన్ని సార్లు చేయాలి. శరీరంపై ఒత్తిడి కలిగితే వెంటనే ఆపాలి.
అధోముఖ శ్వానాసనం
అధోముఖ శ్వానాసనం శరీరంలోని పలు కండరాలకు స్ట్రెచ్‌ను అందించే యోగాసనం. ఈ భంగిమలో శరీరం తలకిందులైన ‘V’ ఆకారంలో ఉంటుంది. నియంత్రిత శ్వాసతో ఈ ఆసనం చేయడం వల్ల శరీరం, మనసు రిలాక్స్ అవ్వడానికి సహాయపడవచ్చు.
ఈ ఆసనం ఎలా వేయాలంటే..
- ముందుగా చేతులు, మోకాళ్లపై బల్ల ఆకారంలో ఉండాలి.
- ఊపిరి వదులుతూ నడుమును నెమ్మదిగా పైకి ఎత్తాలి.
- చేతులు, కాళ్లను సాధ్యమైనంత వరకు నిటారుగా ఉంచి, శరీరాన్ని తలకిందులైన ‘V’ ఆకారంలోకి తీసుకురావాలి.
- తలను రిలాక్స్‌గా ఉంచి, చూపును కాళ్ల వైపు ఉంచాలి.
- ఈ భంగిమలో కొన్ని క్షణాలు ఉండి, నెమ్మదిగా మోకాళ్లను వంచి పూర్వ స్థితికి రావాలి.
బాలాసనం
బాలాసనం శరీరానికి విశ్రాంతిని అందించే సులభమైన యోగాసనం. ఈ భంగిమలో వెన్ను, తుంటి, తొడల కండరాలకు స్వల్పంగా స్ట్రెచ్ లభిస్తుంది. అలాగే నియంత్రిత శ్వాసతో చేయడం వల్ల శరీరం, మనసు ప్రశాంతంగా మారేందుకు సహాయపడవచ్చు.
ఈ ఆసనం ఎలా వేయాలంటే..
- ముందుగా మోకాళ్లపై కూర్చొని, రెండు పాదాల బొటనవేళ్లను ఒకదానికొకటి తాకేలా ఉంచాలి.
- నడుమును వెనక్కి తీసుకెళ్లి మడమలపై కూర్చోవాలి.
- అనంతరం నడుము నుంచి ముందుకు వంగి, నుదిటిని నేలకు దగ్గరగా తీసుకురావాలి.
- చేతులను ముందుకు చాపి నేలపై ఉంచవచ్చు లేదా శరీరం పక్కన సడలించి ఉంచవచ్చు.
- ఈ భంగిమలో సుమారు 20–30 సెకన్లు సౌకర్యంగా ఉండి, నెమ్మదిగా పూర్వ స్థితికి రావాలి.
