విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమీక్ష నిర్వహించారు. బాపట్ల మండలంలో విద్యుత్ వైర్ తగలి తల్లి, కుమారుడు మృతి చెందిన ఘటనపై మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

దీంతో వాయుగుండం కారణంగా ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు పడినా, వైర్లు తెగినా ప్రజల్ని అప్రమత్తం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రజలు కూడా వెంటనే సమీప కార్యాలయానికి ఫిర్యాదు చేసేలా సమాచార వ్యవస్థను పటిష్ఠం చేయాలన్నారు. ముందు జాగ్రత్త చర్యలతో ప్రమాదాలను నివారించాలని సూచించారు. ఘటనలు పునరావృతం కాకూడదని స్పష్టం చేశారు. అలాగే ఉత్తరాంధ్ర ఈదురుగాలులు, వర్షాల వల్ల తాజా పరిస్థితిపైనా మంత్రి ఆరా తీశారు. పలుచోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడితే, కొన్ని చోట్ల ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సరఫరా నిలిపినట్లు అధికారులు తెలిపారు. ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 70-80కి.మీ మేర గాలులు వీస్తున్నందున సరఫరాకు అంతరాయం ఏర్పడుతోందని వివరించారు.

వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా విద్యుత్ సరఫరాను సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాలని మంత్రి ఆదేశించారు. ఎస్పీడీసీఎల్ నుంచి అదనవు సిబ్బందిని, మెటీరియల్ కూడా ఉత్తరాదికి పంపినట్లు తెలిపారు. సాధారణ పరిస్థితి నెలకొనే వరకూ అన్ని చోట్ల విద్యుత్ శాఖ పూర్తి స్థాయిలో సన్నద్ధమై అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. ఎక్కడా ప్రాణ నష్టం వాటిళ్లకుండా అధికారులు విధి నిర్వహణలో బాధ్యతగా ఉండాలని అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ దిశానిర్దేశం చేశారు.

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *