ఆంధ్రప్రదేశ్‌లో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతుండటంతో ఆహార ద్రవ్యోల్బణం ఆందోళనకర స్థాయికి చేరింది. వరుసగా రెండో నెల కూడా దేశంలోనే అత్యధిక ఆహార ద్రవ్యోల్బణం నమోదైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. సెప్టెంబర్‌లో 10.2 శాతంగా ఉన్న ఆహార ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో ఏకంగా 13.23 శాతానికి పెరిగింది. గతేడాదితో పోలిస్తే నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా పెరగడంతో సామాన్యులపై ఆర్థిక భారం మరింత అధికమైంది.

మరోవైపు హోటళ్లు, రెస్టారెంట్లలోనూ ఆహార పదార్థాల ధరలు భారీగా పెరగడంతో బయట భోజనం చేయాలంటేనే సామాన్యులు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. పెరుగుతున్న ధరలు కుటుంబ బడ్జెట్‌పై ప్రభావం చూపుతుండటంతో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతుండగా, తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో గత రెండు, మూడు నెలలుగా ధరల పెరుగుదల సామాన్యులను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. గతంతో పోలిస్తే హోటళ్లు, రెస్టారెంట్లు, బయట ఆహారం తీసుకునేందుకు అయ్యే ఖర్చు 10 నుంచి 20 శాతం వరకు పెరిగింది.

నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో హోటళ్లు, రెస్టారెంట్లతో పాటు రోడ్డు పక్కన ఉండే టిఫిన్‌ సెంటర్లు సైతం తమ మెనూ ధరలను పెంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ధరల పెరుగుదల ప్రభావం తాజాగా ద్రవ్యోల్బణ గణాంకాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో ఆహార ద్రవ్యోల్బణం (ఫుడ్‌ ఇన్‌ఫ్లేషన్‌) సెప్టెంబర్‌లో 10.2 శాతంగా ఉండగా, అక్టోబర్‌లో ఏకంగా 13.23 శాతానికి చేరింది. దీంతో వరుసగా రెండో నెల కూడా దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే అత్యధిక ఆహార ద్రవ్యోల్బణం నమోదైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది. పెరుగుతున్న ధరలతో సామాన్యుల కుటుంబ బడ్జెట్‌పై అదనపు భారం పడుతోంది.

రాష్ట్రవ్యాప్తంగా బియ్యం, పప్పులు, కూరగాయలు, వంట నూనె, గుడ్లు వంటి నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఈ ప్రభావం హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్‌ సెంటర్లపై పడుతోంది. పెరిగిన ముడిసరుకుల ధరల భారాన్ని భరించలేక యజమానులు ఆ అదనపు ఖర్చును వినియోగదారులపై మోపుతున్నారు. ముడిసరుకుల ధరలు ఇదే విధంగా పెరుగుతుండటంతో వ్యాపార నిర్వహణ కష్టంగా మారిందని హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులు చెబుతున్నారు.

నిత్యావసర వస్తువుల ధరలను పరిశీలిస్తే.. మూడు నెలల క్రితం కిలో నాణ్యమైన బియ్యం ధర సుమారు రూ.70 ఉండగా, ప్రస్తుతం రూ.90 దాటింది. అంటే దాదాపు 30 శాతం పెరుగుదల నమోదైంది. అలాగే వంట నూనె ధరలు సుమారు 25 శాతం పెరిగాయి. గుడ్డు రిటైల్‌ ధర ఒక్కొక్కటి రూ.8 దాటగా, కందిపప్పు కిలో ధర రూ.180 నుంచి రూ.200 వరకు పలుకుతోంది.

మరోవైపు ఉల్లిపాయల ధరలు కూడా సామాన్యులకు భారంగా మారాయి. రైతుబజార్లలో ప్రభుత్వం సబ్సిడీపై తక్కువ ధరకు ఉల్లిపాయలను అందిస్తున్నప్పటికీ, నాణ్యతను దృష్టిలో పెట్టుకుని చాలామంది వినియోగదారులు కిరాణా దుకాణాల్లో కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. అయితే అక్కడ నాణ్యమైన ఉల్లిపాయల ధర రైతుబజార్లతో పోలిస్తే కిలోకు రూ.20 నుంచి రూ.30 వరకు అధికంగా ఉంటోంది. మొత్తంగా నిత్యావసరాల ధరల పెరుగుదల సామాన్యుల కుటుంబ బడ్జెట్‌తో పాటు హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహారం తీసుకునే ఖర్చునూ పెంచుతోంది.

నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్‌ సెంటర్ల నిర్వాహకులు ఆహార పదార్థాల ధరలను పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. గతంలో రూ.120 నుంచి రూ.150 వరకు ఉన్న భోజనం ధరలు ప్రస్తుతం 10 నుంచి 15 శాతం మేర పెరిగాయి. హోటల్‌ను బట్టి ఒక్కో ప్లేట్‌పై రూ.20 నుంచి రూ.30 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు.

ఇడ్లీ, దోశ వంటి టిఫిన్ల తయారీకి ఉపయోగించే ముడిసరుకుల ధరలు కూడా దాదాపు 20 శాతం పెరగడంతో వాటి ధరలను సైతం పెంచాల్సి వస్తోందని నిర్వాహకులు చెబుతున్నారు. మరోవైపు టీ స్టాళ్లపైనా ధరల పెరుగుదల ప్రభావం పడుతోంది. పెరిగిన ఖర్చులను భరించలేక టీ ధరలను కూడా పెంచుతున్నారు. గతంలో రూ.10 నుంచి రూ.15 వరకు ఉన్న ఒక కప్పు టీ ధర ప్రస్తుతం దాదాపు రూ.20కి చేరింది.

గత ఏడాది కాలంలో హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లు, టీ స్టాళ్లలో ధరలు పెరగడం ఇది రెండోసారి. గతంలో ఇరాన్‌-అమెరికా యుద్ధ పరిణామాల నేపథ్యంలో వంటగ్యాస్‌ కొరత ఏర్పడి నిర్వహణ ఖర్చులు పెరిగాయి. దీంతో అప్పట్లోనూ ధరలు పెంచాల్సి వచ్చింది. ఇప్పుడు నిత్యావసర వస్తువుల ధరలు మరోసారి పెరగడంతో వ్యాపారులు మళ్లీ ధరల పెంపునకు మొగ్గుచూపుతున్నారు. దీంతో బయట ఆహారం తీసుకునే సామాన్యులపై అదనపు ఆర్థిక భారం పడుతోంది.

నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరగడంతో చిన్నచిన్న హోటళ్లు, టిఫిన్‌ సెంటర్ల నిర్వహణ కష్టంగా మారిందని నిర్వాహకులు చెబుతున్నారు. బియ్యం, పప్పులు, కూరగాయలు, ఇతర వంట సరుకుల ధరలు పెరగడంతో వ్యాపారాల్లో లాభాలు గణనీయంగా తగ్గిపోయాయని వాపోతున్నారు. ప్రస్తుతం వచ్చే ఆదాయంలో ఎక్కువ భాగం నిర్వహణ ఖర్చులకే సరిపోతోందని, ఈ పరిస్థితుల్లో టిఫిన్ల ధరలను సుమారు రూ.10, భోజనం ధరను రూ.20 వరకు పెంచాల్సి వస్తోందని వివరిస్తున్నారు.

మరోవైపు బయట భోజనం, టిఫిన్ల ధరలు పెరగడంతో విద్యార్థులు, నిరుద్యోగ యువత తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సొంతంగా వంట చేసుకునే అవకాశం లేక, హోటళ్లలో భోజనం చేసే స్థోమత కూడా లేకపోవడంతో చాలామంది అన్నా క్యాంటీన్లపై ఆధారపడుతున్నారు.

ఆహార ద్రవ్యోల్బణంలో ఏపీ టాప్‌!

కేంద్ర ప్రభుత్వ ధరల పర్యవేక్షణ గణాంకాలు సామాన్యుల కుటుంబ బడ్జెట్‌పై పెరుగుతున్న భారాన్ని స్పష్టం చేస్తున్నాయి. అక్టోబర్‌ నెల గణాంకాల ప్రకారం గతేడాదితో పోలిస్తే ఉల్లిపాయల ధరలు ఏకంగా 116.22 శాతం పెరగగా, వెల్లుల్లి ధరలు 60.74 శాతం, అల్లం ధరలు 48.32 శాతం, నిమ్మకాయల ధరలు 47.30 శాతం మేర పెరిగాయి.

ఇక పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో ఆహార ద్రవ్యోల్బణం గణనీయంగా అధికంగా నమోదైంది. అక్టోబర్‌ నెలలో తమిళనాడులో 12.37 శాతం, కర్ణాటకలో 12.16 శాతం, ఒడిశాలో 11.66 శాతం, తెలంగాణలో 10.92 శాతం ఆహార ద్రవ్యోల్బణం నమోదైంది. దేశవ్యాప్తంగా ఈ రేటు 8.94 శాతంగా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 13.23 శాతానికి చేరింది.

జాతీయ సగటు కంటే ఏపీలో ఆహార ద్రవ్యోల్బణం 4.29 శాతం అధికంగా ఉండటం గమనార్హం. నిత్యావసర ధరల పెరుగుదలతో సామాన్యులు, మధ్యతరగతి కుటుంబాల నెలవారీ బడ్జెట్‌ తలకిందులవుతోంది. హోటళ్లలో భోజనం నుంచి ఇంటి వంట వరకు ప్రతి విషయంలోనూ ధరల భారం ప్రజలను వెంటాడుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *