బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం రానున్న 24 గంటల్లో డీప్ డిప్రెషన్‌గా బలపడే అవకాశం ఉందని IMD తెలిపింది. సెప్టెంబర్ 23 రాత్రి నుంచి 24 తెల్లవారుజాము మధ్య విశాఖపట్నం–గోపాల్‌పూర్ మధ్య ఉత్తర ఆంధ్ర–దక్షిణ ఒడిశా తీరాన్ని దాటే అవకాశం ఉంది. కోస్తాంధ్రలో 23, 24 తేదీల్లో అత్యంత భారీ వర్షాలు, ఉరుములు, మెరుపులు, బలమైన గాలులకు హెచ్చరికలు జారీ అయ్యాయి.

మరోవైపు తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉండటంతో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అధికారులు. వాయుగుండం ప్రభావం పెరిగే సమయంలో సముద్రంలోకి వెళ్లకపోవడం, ఇప్పటికే సముద్రంలో ఉన్న మత్స్యకారులు సురక్షితంగా తీరానికి చేరుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. వర్షాలతో పాటు బలమైన గాలులు వీచే అవకాశం ఉండటంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగులు, బలహీనంగా ఉన్న నిర్మాణాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. గాలుల సమయంలో బయటకు వెళ్లడం, చెట్ల కింద లేదా విద్యుత్ లైన్ల సమీపంలో నిలబడటం ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అప్రమత్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 23 రాత్రి నుంచి 24 తెల్లవారుజాము వరకు వాయుగుండం తీరం దాటే ప్రక్రియ కీలకం కానుంది. అయితే విశాఖ, గోపాలపూర్ మధ్యే ల్యాండ్‌ఫాల్ ప్రాంతంగా ప్రస్తుతం అంచనా వేస్తున్నారు వాతావరణశాఖ అధికారులు..

తెలంగాణపై కూడా ప్రభావం..

ఏపీతోపాటు సెప్టెంబర్ 24 ఉదయం నుండి సెప్టెంబర్ 25 రాత్రి వరకు తెలంగాణపై వాయుగుండం ప్రభావం అత్యధికంగా ఉండనుందని వాతావరణ శాఖ తెలిపింది. చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని తూర్పు తెలంగాణ జిల్లాల్లో (బ్రౌన్ జోన్) సెప్టెంబర్ 24-25 తేదీల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.. హైదరాబాద్ సిటీ సహా మిగిలిన జిల్లాల్లో కూడా మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. రానున్న మూడు రోజులు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాలను వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

By Hemanth

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *