
సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రాకు ఏపీ ప్రభుత్వం చెల్లించిన ప్రొఫెషనల్ ఫీజుల వ్యవహారం హైకోర్టుకు చేరింది. నిబంధనలకు విరుద్ధంగా భారీ మొత్తంలో ఫీజులు చెల్లించారంటూ విజయవాడకు చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగి వేము కొండలరావు పిల్ దాఖలు చేశారు. 2024 జూన్ నుంచి 2026 జూన్ మధ్య లూథ్రాకు రూ.15.80 కోట్లు చెల్లించినట్లు పిటిషన్లో పేర్కొన్నారు.
2022లో జారీ చేసిన జీఓ 214 ప్రకారం న్యాయవాదులకు కేసుకు గరిష్ఠంగా రూ.3 లక్షల ఫీజు చెల్లించాల్సి ఉందని పిటిషనర్ వాదించారు. లూథ్రాకు చెల్లించిన మొత్తానికి సంబంధించిన జీఓలను రద్దు చేసి, అదనంగా చెల్లించిన మొత్తాన్ని తిరిగి రాబట్టాలని కోరారు.
ఈ పిల్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్, జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం గతంలోనూ న్యాయవాదులకు ఫీజులు చెల్లిస్తోందని.. ఈ వ్యవహారంలో లూథ్రాను మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారని పిటిషనర్‌ను ప్రశ్నించింది. గతంలో ఇదే అంశంపై వివిధ కోర్టులు తీర్పులు ఇచ్చాయని, వాటిని పరిశీలించి తదుపరి విచారణలో కోర్టు ముందుంచాలని ఇరుపక్షాల న్యాయవాదులను ఆదేశించింది.
పిటిషనర్ తరఫు న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్.. లూథ్రాకు చెల్లించిన ఫీజులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని వాదించారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్.. పిటిషనర్ కొన్ని కీలక వాస్తవాలను పిల్లో ప్రస్తావించలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది.
