ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ ప్రాంతాల్లోని పేదలకు ఇళ్లు అందించేందుకు కొత్త టిడ్కో గృహ సముదాయాల నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. తక్కువ స్థలంలో ఎక్కువ కుటుంబాలకు ఇళ్లు అందించేలా జీ+8, జీ+10, జీ+12, జీ+14 అంతస్తుల టవర్లను నిర్మించే ప్రతిపాదన రూపొందించినట్లు సమాచారం.

కొత్తగా నిర్మించనున్న ఫ్లాట్లు కేంద్ర నిబంధనల ప్రకారం 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండేలా ప్రతిపాదించారు. ఒక్కో ఫ్లాట్‌ ధర రూ.15 లక్షల నుంచి రూ.17 లక్షల వరకు ఉండొచ్చని అంచనా. అందుబాటులో ఉన్న స్థలం, లబ్ధిదారుల సంఖ్యను బట్టి ఒక్కో ప్రాంతంలో టవర్ల సంఖ్య, అంతస్తులను నిర్ణయించనున్నారు.

టిడ్కో టవర్ల నిర్మాణంపై ఏపీ అధికారులు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి నమూనాలను పరిశీలించారు. కొత్త గృహ సముదాయాల్లో పార్కింగ్‌, షాపులు, అంగన్‌వాడీ కేంద్రాలు, బ్యాంకులు, కమర్షియల్‌ కాంప్లెక్స్‌లతో పాటు లిఫ్ట్‌ సౌకర్యం కల్పించేలా డిజైన్లు రూపొందించినట్లు తెలుస్తోంది.

2017లో నిర్మించిన టిడ్కో ఇళ్లు ప్రధానంగా జీ+3 విధానంలో ఉండగా.. అప్పట్లో 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్లు నిర్మించారు. ప్రస్తుతం నిర్మాణ వ్యయం పెరగడంతో కొత్త ఇళ్లకు విస్తీర్ణం, అంతస్తుల సంఖ్య ఆధారంగా అధికారులు అంచనాలు రూపొందించినట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు సీఎం చంద్రబాబు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. తుది నిర్ణయం, ధరలు, లబ్ధిదారుల ఎంపికపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సి ఉంది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *