
ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ కార్పొరేషన్లో పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న రిటైర్డ్ ఉద్యోగులకు ఊరట లభించింది. రిటైర్ అయిన ఉద్యోగులకు రీ పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. కార్పొరేషన్లలో ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచిన నేపథ్యంలో.. 60 ఏళ్లకు రిటైరైన పలువురు ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరేందుకు సమ్మతి తెలిపారు.
హౌసింగ్ కార్పొరేషన్లో మొత్తం 219 మంది రిటైర్డ్ ఉద్యోగులు తిరిగి విధుల్లో చేరేందుకు అంగీకరించారు. వీరిలో ఎక్కువ మందికి ఇప్పటికే పోస్టింగ్లు ఇచ్చారు. అయితే మేనేజర్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఈఈ), చీఫ్ ఇంజినీర్ (సీఈ) తదితర 11 పోస్టుల విషయంలో సర్దుబాటుపై కొంతకాలంగా సందిగ్ధత నెలకొంది.
ఈ పోస్టుల్లో ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులను ఎలా సర్దుబాటు చేయాలనే అంశంపై అధికారులు చర్చించారు. చివరకు రివర్షన్ విధానంలో సమస్యను పరిష్కరించారు. ప్రస్తుతం ఆయా పోస్టుల్లో పనిచేస్తున్న జూనియర్ అధికారులను వారి పాత హోదాలకు రివర్షన్ చేసి.. రిటైర్డ్ ఉద్యోగులను సీనియారిటీ ప్రాతిపదికన తిరిగి నియమించేలా ఉత్తర్వులు ఇచ్చారు.
మొత్తం 11 పోస్టుల్లో ఒక సీఈ, నాలుగు ఈఈ, ఆరు మేనేజర్ పోస్టులకు రిటైర్డ్ ఉద్యోగుల సర్దుబాటు అవసరమైంది. దాదాపు రెండు నెలలుగా కొనసాగుతున్న ఈ వ్యవహారానికి తాజా ఉత్తర్వులతో తెరపడింది.
