
ఆంధ్రప్రదేశ్: రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం 7 గంటల నుంచి ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 28 జిల్లా పరిషత్తులు, 659 మండల పరిషత్తుల పరిధిలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. అయితే, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల ఎన్నికల బహిష్కరణలు, రాజకీయ పార్టీల మధ్య వివాదాలతో పోలింగ్ ప్రక్రియలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఎన్నికల బరిలో ఎంతమంది అభ్యర్థులంటే?
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2.61 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో 1.28 కోట్ల మంది పురుషులు, 1.32 కోట్ల మంది మహిళలు, 1,282 మంది ఇతర ఓటర్లు ఉన్నారు.
మొత్తం 659 జడ్పీటీసీ స్థానాలకు గాను 77 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 582 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఈ స్థానాల్లో 2,169 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
అదేవిధంగా 9,821 ఎంపీటీసీ స్థానాలకు గాను 2,051 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మరో 7,767 స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, 18,843 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
వర్షంలోనూ ఓటు వేస్తున్న ప్రజలు
నెల్లూరు జిల్లా ఉదయగిరి, కావలి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. కలిగిరి మండలంలోని పెద్దకొండూరు, క్రాకుటూరు, కుమ్మరికొండూరు, పోలంపాడు తదితర గ్రామాల్లో వర్షాన్ని లెక్కచేయకుండా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
రిజర్వేషన్ల మార్పుతో ఎన్నికల బహిష్కరణ
అనకాపల్లి జిల్లా రోంగనివానిపాలెంలో గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు. రిజర్వేషన్లలో మార్పులపై అసంతృప్తితో ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. మరోవైపు విశాఖ జిల్లా భీమిలి మండలం రాయనిపేటలోనూ గ్రామస్థులు ఎన్నికలను బహిష్కరించారు. గ్రామంలోని చెరువు దుర్వాసన, మురుగునీటి సమస్యలను పరిష్కరించడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని ఆరోపిస్తూ ఓటు వేయడానికి నిరాకరించారు.
మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ ఓటు
నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలోని పోలింగ్ కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
వైసీపీ నేతల హౌస్ అరెస్టులు.. పోలీసుల తీరుపై విమర్శలు
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో పలువురు వైసీపీ నాయకులను పోలీసులు హౌస్ అరెస్టు చేసినట్లు ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. బాపులపాడు మండలం తిప్పనగుంటలో వైసీపీ నేత ముల్పూరు ప్రభుకాంత్‌ను గృహ నిర్బంధం చేయగా, తేలప్రోలు రామును బైండోవర్ కేసుల పేరుతో ఆత్కూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. మరికొందరు నాయకులను కూడా పోలీస్‌స్టేషన్లకు పిలిపించారని ఆరోపించారు.
అనంతపురంలోనూ వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్టు చేసినట్లు సమాచారం. పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా తమను అడ్డుకోవడంపై వైసీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఏలూరులో ప్రశాంతంగా పోలింగ్
ఏలూరు జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు కేంద్రాలకు చేరుకుని ఓటు వేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లతో సందడి నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.
స్టాంపు ప్యాడ్ పనిచేయక గంటపాటు నిలిచిన పోలింగ్
నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామంలోని ఆసుపత్రి ఎదురుగా ఉన్న 21వ నంబర్ పోలింగ్ కేంద్రంలో స్టాంపు ప్యాడ్ పనిచేయకపోవడంతో గంటకు పైగా ఓటింగ్ నిలిచిపోయింది. ఎన్నికల సిబ్బంది గుర్తింపు కార్డులు లేకుండానే విధులు నిర్వహిస్తున్నారని, వార్డుల వివరాల్లో గందరగోళం కారణంగా ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపణలు వచ్చాయి.
ఓటర్ల జాబితాలో తప్పిదాలు.. నిలిచిన పోలింగ్
అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పరిధిలోని మాకవరపాలెం మండల కేంద్రంలో 31, 32, 33, 34 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ నిలిచిపోయింది. బీఎల్‌వోలు పంపిణీ చేసిన ఓటరు స్లిప్పుల్లోని వివరాలు, ఓటర్ల జాబితాలోని వరుస సంఖ్యలు సరిపోకపోవడంతో సమస్య తలెత్తింది. ఈ విషయాన్ని ఎన్నికల అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపించారు.
పోలింగ్ ఏజెంట్ల విషయంలో వివాదాలు
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలం పార్నపల్లెలో పోలింగ్ ఏజెంట్ల అనుమతి విషయంలో వివాదం తలెత్తింది. వైసీపీ ఏజెంట్లను పోలింగ్ బూత్‌లోకి అనుమతించడం లేదని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. ఈ ఘటనతో పోలింగ్ ప్రారంభం ఆలస్యమైనట్లు సమాచారం.
పార్నపల్లెకు వెళ్తున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. వైసీపీ ఏజెంట్లను లోపలికి అనుమతించే వరకు అక్కడి నుంచి వెళ్లబోనని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ నేతలు తమ ఏజెంట్లను అడ్డుకుంటున్నారని కూడా ఆరోపించారు.
పల్నాడులో వైసీపీ ఏజెంట్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
పల్నాడు జిల్లా గురజాల మండలంలోని పులిపాడు, దైద, తెలుకుట్ల, గంగవరం, చర్లగుడిపాడు ప్రాంతాల్లో వైసీపీ ఎన్నికల ఏజెంట్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఏజెంట్ ఫారాలను టీడీపీ నాయకులు తీసుకుని చించివేశారని వైసీపీ నేతలు ఆరోపించారు. ఈ పరిణామాలతో ఆయా ప్రాంతాల్లో రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
For more: MPTC, ZPTC Elections Live Updates in DTV Digital
కాకినాడ జిల్లాలో ముంపు సమస్య
కాకినాడ జిల్లాలోని కొన్ని పోలింగ్ కేంద్రాలు ఇంకా వర్షపు నీటిలోనే ఉన్నాయి. కేంద్రాల్లోకి చేరిన నీటిని ఎన్నికల సిబ్బంది బయటకు తోడుతున్నారు. ఇబ్బందులు ఉన్నప్పటికీ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో పోలింగ్ వాయిదా
భారీ వర్షాలు, ఇతర కారణాలతో ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ వాయిదా పడింది. ఏలూరు జిల్లాలో వేలేరుపాడు, బుట్టాయిగూడెం, జీలుగుమిల్లి, పోలవరం మండలాల్లో మరుసటి రోజు ఎన్నికలు నిర్వహించనున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం మండలంలోనూ పోలింగ్ వాయిదా పడింది. ఈ ప్రాంతాల్లో పోలింగ్ వాయిదా పడినప్పటికీ ఫలితాలు నిర్ణీత షెడ్యూల్ ప్రకారమే వెల్లడికానున్నాయి.
