
కోల్‌కతా, బాణాసంచా పేల్చడం వల్ల అనేక వ్యాధులు నయమవుతాయని పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పాపియా అధికారి వ్యాఖ్యానించారు. టొల్లిగంజ్ నియోజకవర్గంలో నిర్వహించిన కాళీ పూజ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఆమె ప్రసంగిస్తున్న సమయంలో అక్కడ పటాకులు పేలడంతో ఈ అంశంపై స్పందించారు. బాణాసంచా కాల్చడం వల్ల అనేక వ్యాధులు దూరమవుతాయని పేర్కొన్నారు.
కాళీ పూజ సందర్భంగా బాణాసంచా పేల్చుకోవచ్చని ముఖ్యమంత్రి సూచించారని పాపియా అధికారి తెలిపారు. పటాకులు పేల్చకుండా కాళీ పూజ పూర్తికాదని, తప్పకుండా బాణాసంచా కాలుస్తామని అన్నారు. అయితే పోలీసుల మార్గదర్శకాలకు అనుగుణంగానే బాణాసంచా పేలుళ్లు ఉంటాయని స్పష్టం చేశారు.
మరోవైపు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి ఇటీవల కాళీ పూజ మండపాలను ప్రారంభిస్తూ పర్యావరణహితమైన గ్రీన్ క్రాకర్స్ మాత్రమే వినియోగించాలని సూచించారు. భారీ శబ్దాలు వచ్చే బాణాసంచాకు దూరంగా ఉండాలని, శబ్ద కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని వేడుకలు నిర్వహించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. దీంతో బాణాసంచాపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
