
D Spiritual: Nov 9: మంత్రాలయంలో వైభవంగా ప్రహ్లాదరాయల ఊంజల సేవ.. కార్తీక దీపోత్సవం
ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన మంత్రాలయంలో ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలకు వైభవంగా ఊంజల సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీమఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు స్వయంగా ఉత్సవ కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఊంజల మండపంలో కార్తీక దీపాలను వెలిగించి ప్రహ్లాదరాయలకు మంగళహారతులు సమర్పించారు.
ఈ సందర్భంగా భక్తులు సైతం శ్రీమఠం ప్రాకారంలో పెద్ద సంఖ్యలో కార్తీక దీపాలను వెలిగించి స్వామివారిని భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. అనంతరం ఉత్సవమూర్తి ప్రహ్లాదరాయలను వెండి అంబారితో పాటు చెక్క, వెండి, బంగారు, నవరత్న రథాలపై అధిష్ఠింపజేసి శ్రీమఠం ప్రాకారంలో వైభవంగా ఊరేగించారు.
ప్రహ్లాదరాయల రథోత్సవాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు మంత్రాలయానికి తరలివచ్చారు. ఈ సందర్భంగా పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు భక్తులకు ఫలమంత్ర అక్షింతలు అందించి ఆశీర్వచనాలు ఇచ్చారు. కార్తీక మాసం సందర్భంగా నిర్వహించిన ఈ ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో మంత్రాలయం భక్తి పారవశ్యంలో మునిగిపోయింది.
