హైదరాబాద్, టాలీవుడ్‌లో యువ కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకునే ప్రయత్నం చేస్తున్నాడు రోషన్ కనకాల. ప్రముఖ యాంకర్ సుమ కనకాల, నటుడు రాజీవ్ కనకాల తనయుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన.. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్నాడు. ఇప్పటికే ‘బబుల్ గమ్’, ‘మోగ్లీ’ వంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. తాజాగా మరో కొత్త ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.

విభిన్నమైన కథాంశాలతో సినిమాలు తెరకెక్కించే దర్శకుడు వీఐ ఆనంద్ అందించిన కథతో రోషన్ తన తదుపరి చిత్రాన్ని చేయనున్నాడు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘ఒక్క క్షణం’, ‘డిస్కో రాజా’ వంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వీఐ ఆనంద్.. ఈసారి రోషన్ కోసం ఓ ఆసక్తికరమైన కథను సిద్ధం చేశారు. ఈ చిత్రానికి విజయ్ కే కామిశెట్టి దర్శకత్వం వహించనున్నారు. వీఐ ఆనంద్ కథ అందిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. దీంతో సినిమాలో రోషన్ ఎలాంటి పాత్రలో కనిపించనున్నాడు? కథాంశం ఏ జానర్‌కు సంబంధించినది? అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. పూర్తి వివరాలను వెల్లడించకుండానే ప్రీ లుక్‌తో సినిమాపై క్యూరియాసిటీ పెంచారు మేకర్స్.

ఇప్పటికే విభిన్నమైన కథలతో తన నటనలో వైవిధ్యాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్న రోషన్.. వీఐ ఆనంద్ కథతో మరో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రాన్ని బాలాజీ గుట్ట, కౌశిక్ రెడ్డి సంయుక్తంగా నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ లుక్ మాత్రమే విడుదల కాగా.. హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక బృందం, సంగీత దర్శకుడికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. సినిమా రెగ్యులర్ షూటింగ్, విడుదల తేదీపై కూడా చిత్రబృందం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *