
హైదరాబాద్, ఆంధ్రప్రభ: భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెప్టెన్, ధ్యాన్‌చంద్ అవార్డు గ్రహీత షబ్బీర్ అలీపై తెలంగాణ ఫుట్‌బాల్ అసోసియేషన్ (టీఎఫ్ఏ) కఠిన చర్యలు తీసుకుంది. క్రమశిక్షణా ఉల్లంఘనలకు పాల్పడినట్లు తేలడంతో ఆయనపై ఏడాది పాటు సస్పెన్షన్ విధించింది. అబ్బాస్ యూనియన్ ఫుట్‌బాల్ క్లబ్ అధ్యక్షుడి హోదాలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినట్లు అసోసియేషన్ పేర్కొంది. ఈ విషయాన్ని టీఎఫ్ఏ కార్యదర్శి జీ. ఫాల్గుణ వెల్లడించారు.
సంతోష్ ట్రోఫీ కోసం తెలంగాణ జట్టుకు కోచ్‌గా షబ్బీర్ అలీని నియమించిన సమయంలో వివాదం మొదలైంది. ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ (ఏఐఎఫ్ఎఫ్) మార్గదర్శకాల ప్రకారం కోచ్‌గా వ్యవహరించేందుకు అవసరమైన ఏఎఫ్సీ బీ లైసెన్స్ తన వద్ద ఉన్నట్లు షబ్బీర్ సమాచారం ఇచ్చారు. దీంతో ఆయనను కోచ్‌గా నియమించినట్లు టీఎఫ్ఏ తెలిపింది. అయితే బెంగళూరులో సంతోష్ ట్రోఫీ పోటీలు జరుగుతున్న సమయంలో ఆయన కోచ్‌గా వ్యవహరించేందుకు ఏఐఎఫ్ఎఫ్ అనుమతించలేదు. ఈ క్రమంలో షబ్బీర్ వద్ద అవసరమైన ఏఎఫ్సీ బీ లైసెన్స్ లేదనే విషయం వెలుగులోకి వచ్చినట్లు ఫాల్గుణ వివరించారు.
ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించిన తెలంగాణ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, టెక్నికల్ కమిటీ, జనరల్ బాడీ సమావేశాల్లో చర్చించి చర్యలు తీసుకుంది. కోచింగ్ అర్హతలకు సంబంధించిన సమాచారంతో పాటు ఇతర క్రీడా సమావేశాల్లో నిబంధనలకు విరుద్ధంగా పాల్గొన్నారనే ఆరోపణలను కూడా పరిగణనలోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో షబ్బీర్ అలీపై ఏడాది పాటు సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకుంది.
