
అమరావతి, చిత్తూరులోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం ఘటనపై వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. ఈ ఘటనకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ బాధ్యత వహించాలని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, పరిస్థితులు ఇలాగే కొనసాగితే విద్యార్థులకు ఆత్మహత్యలే దిక్కవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ఇదే కళాశాలలో గతంలోనూ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని జగన్ తన పోస్టులో పేర్కొన్నారు. అప్పట్లో విద్యార్థులు రోడ్డెక్కి తమ ఆవేదన, ఆగ్రహాన్ని వ్యక్తం చేసినప్పటికీ ప్రభుత్వం సమస్యను పక్కదారి పట్టించే ప్రయత్నం చేసిందని ఆరోపించారు. ఇలాంటి పాలనను గతంలో ఎప్పుడూ చూడలేదని విమర్శించారు.
పేద విద్యార్థులకు నాణ్యమైన ఉన్నత విద్య అందించాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతిదీవెన వంటి పథకాలను ప్రవేశపెట్టి అమలు చేసిందని జగన్ గుర్తుచేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే విధంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
ఫీజు రీయింబర్స్మెంట్, వసతిదీవెన పథకాలను నిర్వీర్యం చేసి పేద విద్యార్థుల భవిష్యత్తును దెబ్బతీస్తున్నారని విమర్శించారు. విద్యార్థులకు సుమారు రూ.9,600 కోట్లకు పైగా బకాయిలు చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. విద్యాశాఖ నిర్వహణలో విఫలమయ్యారని ఆరోపిస్తూ మంత్రి నారా లోకేష్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని జగన్ డిమాండ్ చేశారు.
