
తెలంగాణ కాంగ్రెస్‌లో మరోసారి అంతర్గత విభేదాలు తెరపైకి వచ్చాయి. తన మునుగోడు నియోజకవర్గానికి నిధుల కేటాయింపులో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వివక్ష చూపుతున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యమంత్రిపై ఆయన బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేయడంతో కాంగ్రెస్ అధిష్ఠానం ఈ వ్యవహారంపై దృష్టి సారించింది.
ఈ నేపథ్యంలో ఏఐసీసీ కార్యదర్శి రాజగోపాల్‌రెడ్డికి ఫోన్ చేసి మాట్లాడారు. తెలంగాణ కాంగ్రెస్ నూతన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ను కలిసి తన అభిప్రాయాలను వివరించాలని సూచించినట్లు సమాచారం. మరోవైపు, ఈ పరిణామాలపై టీపీసీసీ అధ్యక్షుడు కూడా స్పందించారు. సరైన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొనడంతో తెలంగాణ కాంగ్రెస్‌లో తాజా పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.
మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యవహారంపై పార్టీ అధిష్ఠానం సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకు హైకమాండ్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. ఏఐసీసీ కార్యదర్శి రాజగోపాల్‌రెడ్డితో మాట్లాడి, ఈ నెల 23న తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇన్ఛార్జ్ బీఎం సందీప్‌ను కలిసి చర్చించాలని సూచించినట్లు సమాచారం.
మరోవైపు, రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. రాజగోపాల్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏఐసీసీ పరిశీలిస్తుందని వెల్లడించారు.
క్రమశిక్షణ చర్యల విషయంలో అధిష్ఠానం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని మహేశ్‌కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. కొండా సురేఖ విషయంలోనూ మొదటిసారే చర్యలు తీసుకోలేదని, ఆమె వ్యవహారాన్ని రెండు మూడు సార్లు పరిశీలించిన తర్వాతే అధిష్ఠానం నిర్ణయం తీసుకుందని గుర్తుచేశారు.
ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తన మునుగోడు నియోజకవర్గానికి నిధుల కేటాయింపులో ప్రభుత్వం వివక్ష చూపుతోందంటూ ఆయన సీఎంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అభివృద్ధి అంటే కేవలం కొడంగల్, మధిర, హుజూర్నగర్ నియోజకవర్గాలకే పరిమితం కాదని, మునుగోడు అభివృద్ధిని కూడా ప్రభుత్వం పట్టించుకోవాలని డిమాండ్ చేశారు.
తన నియోజకవర్గానికి నిధులు కేటాయించకపోతే మరో కురుక్షేత్రం తప్పదని రాజగోపాల్‌రెడ్డి హెచ్చరించారు. అంతేకాకుండా సీఎం రేవంత్‌రెడ్డి మరో రెండేళ్లు మాత్రమే పదవిలో ఉంటారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. అదృష్టవశాత్తూ వచ్చిన అధికారాన్ని ఉపయోగించుకుని అవినీతికి పాల్పడే పాలకులను తెలంగాణ ప్రజలు, చరిత్ర ఎప్పటికీ క్షమించవని కూడా వ్యాఖ్యానించారు.
సిద్దిపేట సభలో సీఎం రేవంత్‌రెడ్డి తనను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలకు స్పందనగానే రాజగోపాల్‌రెడ్డి ఈ విమర్శలు చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఇదిలా ఉండగా, తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల నూతన ఇన్‌ఛార్జ్‌గా నియమితులైన బి.ఎం. సందీప్ ఆదివారం (నవంబర్ 22) హైదరాబాద్‌కు రానున్నారు. గాంధీభవన్‌లో నిర్వహించనున్న రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ), ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) సంయుక్త సమావేశంలో ఆయన పాల్గొననున్నారు.
అనంతరం నవంబర్ 23న సోమవారం గాంధీభవన్‌లో పార్టీ నేతలతో వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. ఉదయం రాష్ట్ర మంత్రులతో భేటీ కానుండగా, మధ్యాహ్నం నుంచి డీసీసీ అధ్యక్షులు, పీసీసీ అనుబంధ సంఘాల అధ్యక్షులతో సమావేశమవుతారు. ఈ భేటీల్లో పార్టీ సంస్థాగత వ్యవహారాలు, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది.
