నందికొట్కూరు, నంద్యాల జిల్లా పగిడ్యాల మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) ఎంపిక వ్యవహారం ఉత్కంఠ రేపుతోంది. అధికార టీడీపీలోని ఎంపీ, ఎమ్మెల్యే వర్గాల మధ్య నెలకొన్న విభేదాలు ఎంపీపీ ఎన్నికకు ఆటంకంగా మారాయి. ఇరువర్గాలు తమ పట్టువీడకపోవడంతో ఎంపిక ప్రక్రియ ప్రతిష్టంభనలో పడింది. వివాదాన్ని పరిష్కరించేందుకు పార్టీ అబ్జర్వర్ రంగంలోకి దిగినా ఆశించిన ఫలితం కనిపించలేదు.

ఎంపీపీ ఎంపికపై నెలకొన్న వివాదానికి తెరదించేందుకు పార్టీ అబ్జర్వర్ వెంకట శివుడు ఇరువర్గాల ప్రతినిధులతో చర్చలు జరిపారు. ఎమ్మెల్యే వర్గం తరఫున రాజశేఖర్ రెడ్డి, ఎంపీ వర్గం తరఫున మహేష్ నాయుడుతో సంప్రదింపులు నిర్వహించారు. ఇరువర్గాల మధ్య ఏకాభిప్రాయం తీసుకొచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ చర్చలు సఫలం కాలేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఎంపీటీసీ సభ్యులు సమావేశ మందిరం నుంచి వెనుదిరిగినట్లు సమాచారం. దీంతో ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ ముందుకు సాగుతుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

మరోవైపు, ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిరితే లక్కీ డ్రా పద్ధతిలో ఎంపీపీని ఎంపిక చేసే అవకాశం ఉందన్న ప్రచారం సాగుతోంది. ఇందుకోసం ఇరువర్గాలకు సాయంత్రం ఐదు గంటల వరకు గడువు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈలోగా ఏకాభిప్రాయం కుదరకపోతే ఎన్నిక మరోసారి వాయిదా పడే అవకాశం ఉంది. దీంతో పగిడ్యాల మండల పరిషత్ పీఠం ఎవరిని వరిస్తుందన్న అంశంపై రాజకీయ వర్గాలతో పాటు స్థానికంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *