
ఆంధ్రప్రదేశ్‌లో పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) పునరుద్ధరించాలని ప్రభుత్వ ఉద్యోగులు దాదాపు రెండు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నారు. తాజాగా కూటమి ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుత కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) పరిధిలో ఉన్న అర్హులైన ఉద్యోగులు తిరిగి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)లోకి మారేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. సెప్టెంబర్ 1, 2004కు ముందు ఉద్యోగ నియామకాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలై, ఆ నియామక ప్రక్రియ ద్వారా ఎంపికైన ఉద్యోగులు ఈ వెసులుబాటును వినియోగించుకోవచ్చు.
అర్హులైన ఉద్యోగులు డిసెంబర్ 31వ తేదీలోగా వన్‌టైమ్ ఆప్షన్ ద్వారా ఓపీఎస్‌లోకి మారేందుకు తమ పేర్లను నమోదు చేసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దీంతో ఎన్నో ఏళ్లుగా పాత పెన్షన్ విధానం కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగుల్లో ఈ నిర్ణయంపై ఆసక్తి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త అందించింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) నుంచి పాత పెన్షన్ విధానం (OPS)లోకి మారేందుకు అవసరమైన మార్గదర్శకాలను ఖరారు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ జీఓ ఎంఎస్ నంబర్ 158ను విడుదల చేసింది.
సెప్టెంబర్ 1, 2004కు ముందు ఉద్యోగ నియామక నోటిఫికేషన్ విడుదలై, ఆ తేదీ తర్వాత విధుల్లో చేరిన ఉద్యోగులకు సీపీఎస్ నుంచి ఓపీఎస్‌లోకి మారేందుకు ప్రభుత్వం వన్‌టైమ్ ఆప్షన్ కల్పించింది. ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు డిసెంబర్ 31వ తేదీని తుది గడువుగా నిర్ణయించింది. ఈ ప్రక్రియ మొత్తం ఆన్‌లైన్‌లోని ‘నిధి (NIDHI)’ పోర్టల్ ద్వారానే నిర్వహించనున్నారు.
రిటైర్డ్, మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కూడా అవకాశం
ప్రస్తుతం విధుల్లో కొనసాగుతున్న ఉద్యోగులతో పాటు ఇప్పటికే పదవీ విరమణ చేసినవారు, మరణించిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. ఇందుకోసం సంబంధిత ఉద్యోగి తొలి నియామక అధికారి నుంచి పొందిన నియామక నోటిఫికేషన్, ఎంపిక జాబితా, నియామక ఉత్తర్వులు, విధుల్లో చేరినట్లు ధ్రువీకరించే పత్రాల ప్రతులను సిద్ధం చేసుకోవాలి.
ఈ పత్రాలను NIDHI పోర్టల్‌లోని ‘CPS-OPS Conversion’ విభాగంలో అప్‌లోడ్ చేసి వన్‌టైమ్ ఆప్షన్‌ను సమర్పించాల్సి ఉంటుంది. అయితే, ఒకసారి ఆప్షన్ సమర్పించిన తర్వాత దాన్ని మార్చుకునే అవకాశం ఉండదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఓపీఎస్‌కు మారిన తర్వాత జీపీఎఫ్ పరిధిలోకి
ఉద్యోగి సమర్పించిన ఆప్షన్‌కు అధికారుల ఆమోదం లభించిన వెంటనే సంబంధిత ఉద్యోగిని జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (GPF) లేదా వర్తించే ఇతర ప్రావిడెంట్ ఫండ్ పరిధిలోకి మారుస్తారు. ఇందుకు అనుగుణంగా అవసరమైన నిబంధనలను రూపొందించినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
దీంతో సీపీఎస్ నుంచి ఓపీఎస్‌కు మారాలని ఎదురుచూస్తున్న అర్హులైన ఉద్యోగులకు ఈ ఉత్తర్వులు కీలకంగా మారాయి.
కొత్త మార్గదర్శకాల ప్రకారం.. ఉద్యోగి సీపీఎస్ కార్పస్ ఫండ్‌లో జమ అయిన ఉద్యోగి వాటాను వారి జీపీఎఫ్ ఖాతాకు బదిలీ చేయనున్నారు. మరోవైపు, ప్రభుత్వం జమ చేసిన వాటాతో పాటు దానిపై వచ్చిన వడ్డీ మొత్తాన్ని తిరిగి ప్రభుత్వ ఖాతాకు మళ్లించనున్నారు. ఈ విధానం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అమలవుతున్న జాతీయ పింఛన్ పథకానికి సంబంధించిన నిబంధనలను అనుసరించి రూపొందించారు.
కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే తరహాలో గతంలో కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ పింఛన్ విధానం అమల్లోకి రాకముందే నియామక ప్రక్రియ ప్రారంభమై, ఆ తర్వాత ఉద్యోగాల్లో చేరిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వన్‌టైమ్ ఆప్షన్ కల్పిస్తూ 2020 ఫిబ్రవరి 17, 2023 మార్చి 3 తేదీల్లో పెన్షన్, పెన్షనర్ల సంక్షేమ శాఖ కార్యాలయ మెమోరాండాలను జారీ చేసింది.
కేంద్ర ప్రభుత్వ విధానాన్ని అనుసరిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అర్హులైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సీపీఎస్ నుంచి ఓపీఎస్‌లోకి మారేందుకు ఒకేసారి అవకాశం కల్పించింది. ఈ విధానం అమలుకు సంబంధించిన పూర్తి కార్యాచరణ మార్గదర్శకాలను తాజాగా విడుదల చేసింది.
పారదర్శకంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు
తాజా ఉత్తర్వుల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధమైన విధానాన్ని అమలు చేయడంతో పాటు ప్రక్రియలో పారదర్శకత ఉండేలా Annexure-Iలో వివరణాత్మక మార్గదర్శకాలను పొందుపరిచారు. ఉద్యోగుల నుంచి వచ్చే ప్రతిపాదనలను సంబంధిత నియామక అధికారులు, కార్యాలయ అధిపతులు వీలైనంత త్వరగా పరిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది.
అలాగే ఉద్యోగులకు సంబంధించిన సర్వీసు రికార్డులు, ఇతర అవసరమైన పత్రాలను భద్రంగా నిర్వహించాలని స్పష్టం చేసింది. పెన్షన్ ప్రయోజనాల పరిష్కారంలో ఎలాంటి జాప్యం జరగకుండా పారదర్శకత, జవాబుదారీతనంతో వ్యవహరించాలని అధికారులకు సూచించింది.
