IRCTC Karnataka Bharat Gaurav Dakshina Yatra: కర్ణాటక ప్రభుత్వం, ఐఆర్‌సీటీసీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కర్ణాటక భారత్ గౌరవ్ దక్షిణ యాత్ర భక్తులకు పలు ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఒకే టూర్‌లో సందర్శించే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ 6 రోజుల యాత్రలో కన్యాకుమారి, తిరువనంతపురం, రామేశ్వరం, మదురై వంటి ప్రసిద్ధ ఆధ్యాత్మిక ప్రాంతాలను దర్శించుకోవచ్చు.
ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని రైలు ప్రయాణం, వసతి, భోజనం వంటి సదుపాయాలను ప్యాకేజీలో అందిస్తున్నారు. అంతేకాకుండా, ఈ యాత్రకు ప్రభుత్వం అందించే సబ్సిడీ కారణంగా టూర్ ఖర్చు కూడా అందుబాటులో ఉండేలా రూపొందించారు. టూర్ ధర ఎంత? ప్రభుత్వం అందించే సబ్సిడీ ఎంత? ప్రయాణంలో ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారు? యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

IRCTC Karnataka Bharat Gaurav Dakshina Yatra Telugu: దక్షిణ భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను ఒకే యాత్రలో దర్శించుకోవాలనుకునే భక్తులకు ఇది మంచి అవకాశం. కర్ణాటక ప్రభుత్వం, ఐఆర్‌సీటీసీ లిమిటెడ్ సంయుక్తంగా “కర్ణాటక భారత్ గౌరవ్ దక్షిణ యాత్ర” పేరుతో ప్రత్యేక తీర్థయాత్రను నిర్వహించనున్నాయి. భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో సాగే ఈ యాత్రలో కన్యాకుమారి, తిరువనంతపురం, రామేశ్వరం, మదురై వంటి ప్రసిద్ధ ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించవచ్చు.
ఈ యాత్ర 2026 సెప్టెంబర్ 16న బెలగావి నుంచి ప్రారంభమై, మొత్తం 5 రాత్రులు, 6 రోజుల పాటు కొనసాగుతుంది. ఒక్కో ప్రయాణికుడికి టూర్ ధర రూ.15,000గా నిర్ణయించారు. కర్ణాటకలో నివసించే అర్హులైన ప్రయాణికులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5,000 సబ్సిడీ అందిస్తోంది. దీంతో వారికి ఈ యాత్ర మరింత తక్కువ ధరకే అందుబాటులోకి వస్తుంది.
సందర్శించే పుణ్యక్షేత్రాలు ఇవే..
యాత్రలో భాగంగా కన్యాకుమారిలో భగవతి అమ్మవారి ఆలయం, వివేకానంద రాక్ మెమోరియల్‌ను సందర్శించే అవకాశం ఉంటుంది. అలాగే అక్కడ సూర్యోదయం, సూర్యాస్తమయాన్ని వీక్షించవచ్చు. తిరువనంతపురంలో ప్రసిద్ధ శ్రీ పద్మనాభస్వామి ఆలయం, రామేశ్వరంలో రామనాథస్వామి ఆలయం, మదురైలో మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని దర్శించవచ్చు.
యాత్ర షెడ్యూల్..
మొదటి రోజు: బెలగావి నుంచి ప్రత్యేక భారత్ గౌరవ్ రైలు బయలుదేరుతుంది. హుబ్బళి, హావేరి, దావణగెరె, బీరూర్, తుమకూరు, ఎస్‌ఎంవీటీ బెంగళూరు తదితర ప్రాంతాల్లో బోర్డింగ్ సౌకర్యం ఉంటుంది.
రెండో రోజు: కన్యాకుమారి చేరుకుని ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తారు.
మూడో రోజు: తిరువనంతపురం చేరుకుని శ్రీ పద్మనాభస్వామి ఆలయాన్ని దర్శిస్తారు.
నాలుగో రోజు: రామేశ్వరం చేరుకుని రామనాథస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు.
ఐదో రోజు: మదురైలో మీనాక్షి అమ్మవారి ఆలయాన్ని దర్శిస్తారు.
ఆరో రోజు: యాత్ర పూర్తిచేసుకుని తిరుగు ప్రయాణం ప్రారంభమవుతుంది.
ప్యాకేజీలో ఏమేం ఉన్నాయి?
ఈ టూర్ ప్యాకేజీలో 3AC తరగతిలో భారత్ గౌరవ్ ప్రత్యేక రైలు ప్రయాణం, నాన్-ఏసీ హోటళ్లలో ట్విన్/ట్రిపుల్ షేరింగ్ బస, అవసరమైన ప్రాంతాల్లో వాష్ అండ్ చేంజ్ సౌకర్యం, శాకాహార భోజనం, నాన్-ఏసీ బస్సుల్లో స్థానిక రవాణా, సైట్‌సీయింగ్, ప్రయాణ బీమా, రైలులో భద్రత, వర్తించే పన్నులు ఉన్నాయి.
అయితే బోటింగ్, అడ్వెంచర్ స్పోర్ట్స్, స్థానిక గైడ్ ఛార్జీలు, ప్రవేశ రుసుములు, టిప్స్, వ్యక్తిగత ఖర్చులు, రూమ్ సర్వీస్, మినరల్ వాటర్ వంటి ఖర్చులు ప్యాకేజీలో ఉండవు. భోజనానికి ముందుగా నిర్ణయించిన మెనూనే అందిస్తారు. ప్రయాణికులు ప్రత్యేకంగా మెనూను ఎంచుకునే అవకాశం ఉండదు.
