చిదంబరం నటరాజ స్వామి ఆలయంలో తెర వెనుక కనిపించే శూన్య దర్శనాన్నే ‘చిదంబర రహస్యం’గా పిలుస్తారు. అక్కడ ఎలాంటి విగ్రహం కనిపించకపోవడం వెనుక ఉన్న ఆధ్యాత్మిక భావన, ఆకాశ తత్త్వంతో దాని అనుబంధం, నటరాజుడి ఆనంద తాండవం, అలాగే తారకావనానికి సంబంధించిన పురాణ గాథ ఎంతో ప్రత్యేకమైనవి. అసలు ‘చిదంబర రహస్యం’ అంటే ఏమిటి? దాని వెనుక దాగి ఉన్న ఆధ్యాత్మిక తత్వం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎప్పుడైనా మనకు అర్థంకాని విషయం ఎదురైతే.. “ఇదంతా చిదంబర రహస్యం” అని అంటుంటాం. అయితే అసలు ఈ మాట ఎలా వచ్చింది? చిదంబర రహస్యం అంటే ఏమిటి? తమిళనాడులోని ప్రసిద్ధ చిదంబరం నటరాజ స్వామి ఆలయంలోని ఓ ప్రత్యేకమైన ఆధ్యాత్మిక సంప్రదాయమే ఈ పదానికి మూలమని చెబుతారు. ఆలయ గర్భగుడిలో తెర తొలగించినప్పుడు కనిపించే నిరాకార దర్శనం వెనుక లోతైన తాత్విక సందేశం ఉందని పురాణాలు, ఆలయ సంప్రదాయాలు వివరిస్తాయి.

పంచభూతాల్లో ఆకాశ తత్వానికి ప్రతీక

హిందూ తత్వశాస్త్రం ప్రకారం ప్రకృతి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అనే ఐదు పంచభూతాలతో ఏర్పడింది. వీటికి ప్రతీకలుగా భావించే పంచభూత క్షేత్రాల్లో చిదంబరం ఆకాశ తత్వానికి ప్రతినిధిగా ప్రసిద్ధి చెందింది. ఇతర క్షేత్రాల్లో శివుడు లింగ రూపంలో దర్శనమిస్తే.. చిదంబరంలో మాత్రం నిరాకారమైన ఆకాశ తత్వంగా పరమశివుడిని ఆరాధిస్తారని భక్తుల విశ్వాసం.

తెర వెనుక కనిపించేదే ‘చిదంబర రహస్యం’

చిదంబరం నటరాజ స్వామి గర్భగుడిలో నటరాజ విగ్రహానికి సమీపంలో ప్రత్యేకమైన తెర ఉంటుంది. పూజా కార్యక్రమాల్లో భాగంగా ఆ తెరను తొలగించి దీపారాధన చేసినప్పుడు.. అక్కడ సాధారణంగా కనిపించే శివలింగం లేదా మరో విగ్రహం ఉండదు. శూన్యాన్ని సూచించే నిరాకార దర్శనంతో పాటు బంగారు బిల్వ ఆకుల అలంకరణ కనిపిస్తుంది. ఈ ప్రత్యేక దర్శనాన్నే భక్తులు “చిదంబర రహస్యం”గా భావిస్తారు.

అయితే ఇది ఎవరికీ తెలియని ఏదో రహస్య వస్తువు దాగి ఉందనే అర్థంలో కాదు. దేవుడిని ఒక నిర్దిష్ట రూపానికే పరిమితం చేయలేమని, పరమాత్మ సర్వవ్యాపి.. నిరాకార స్వరూపుడిగా కూడా ఉన్నాడనే ఆధ్యాత్మిక భావనకు ఇది ప్రతీకగా చెబుతారు. కనిపించని ఆకాశం, కనిపించే రూపం రెండింటినీ కలిపి భగవంతుడి తత్వాన్ని అర్థం చేసుకోవాలనే సందేశాన్ని ‘చిదంబర రహస్యం’ అందిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *