రంగారెడ్డి: కాంగ్రెస్ ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ డాక్టర్ బల్మూరి వెంకట్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. తిరుపతి నుంచి హైదరాబాద్‌కు తిరిగి వస్తుండగా రంగారెడ్డి జిల్లా కొత్తూరు బైపాస్ సమీపంలోని దర్గా చౌరస్తా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ముందుగా వెళ్తున్న కోళ్ల లోడుతో కూడిన డీసీఎం వాహనాన్ని ఆయన కారు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసమైనప్పటికీ బల్మూరి వెంకట్, ఆయన భార్య ఎలాంటి ప్రాణాపాయం లేకుండా బయటపడ్డారు.

వివరాల్లోకి వెళ్తే.. బల్మూరి వెంకట్ తన భార్య, సోదరుడు చాణక్య, కారు డ్రైవర్ శ్రీకాంత్‌తో కలిసి తిరుపతి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కొత్తూరు బైపాస్ సమీపంలోని దర్గా చౌరస్తా వద్దకు చేరుకోగానే కారు ముందున్న డీసీఎం వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. దీంతో కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది.

ఈ ప్రమాదంలో డ్రైవర్ శ్రీకాంత్, బల్మూరి వెంకట్ సోదరుడు చాణక్య స్వల్పంగా గాయపడ్డారు. అయితే ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్, ఆయన సతీమణికి ఎలాంటి ప్రాణాపాయం కలగలేదు. ప్రమాదం నుంచి వారు సురక్షితంగా బయటపడటంతో కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *