
దౌల్తాబాద్, నవంబర్ 17: రైతులకు అవసరమైన ఎరువులను నిబంధనల ప్రకారం విక్రయించాల్సిన వ్యాపారులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యూరియా బస్తాలు కావాలంటే అదనంగా నానో డీఏపీ కూడా కొనుగోలు చేయాలని షరతు విధిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల కేంద్రంలోని జ్యోతి ఫర్టిలైజర్ దుకాణంలో ఇలాంటి పరిస్థితి ఎదురవుతోందని రైతులు ఆరోపిస్తున్నారు.
మండలంలోని తిరుమలాపూర్ గ్రామానికి చెందిన రైతు చాకలి వెంకటయ్య ఈ నెల 16న ఆన్‌లైన్‌లో 24 బస్తాల యూరియా బుక్ చేసుకున్నాడు. సోమవారం ఎరువుల దుకాణానికి వెళ్లగా మరుసటి రోజు యూరియా ఇస్తామని నిర్వాహకులు చెప్పడంతో వెనుదిరిగాడు. దీంతో మంగళవారం ఉదయం 10 గంటలకు మళ్లీ దుకాణానికి చేరుకున్నాడు. అయితే సాయంత్రం 4 గంటల వరకు వేచి చూసినా యూరియా బస్తాలు ఇవ్వలేదని వెంకటయ్య ఆవేదన వ్యక్తం చేశాడు.
యూరియా కావాలంటే నానో డీఏపీ కూడా తప్పనిసరిగా కొనుగోలు చేయాలని దుకాణ యజమాని గోపిశెట్టి శ్రీనివాస్ షరతు విధించారని వెంకటయ్య ఆరోపించాడు. తమకు అదనపు ఎరువులు అవసరం లేదని, యూరియా మాత్రమే ఇవ్వాలని కోరినా నిరాకరించారని తెలిపాడు. అంతేకాకుండా ఈ విషయాన్ని ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి.. నానో డీఏపీతో కలిపే యూరియా విక్రయిస్తానంటూ దురుసుగా సమాధానం ఇచ్చినట్లు వాపోయాడు.
రైతుల ఇబ్బందులు పట్టించుకునేదెవరు?
ప్రస్తుతం వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో యూరియా కోసం రైతులు ఎరువుల దుకాణాల చుట్టూ తిరగాల్సి వస్తోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జ్యోతి ఫర్టిలైజర్‌లో యూరియాతో పాటు నానో డీఏపీని కూడా తప్పనిసరిగా కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. గతంలోనూ ఇలాంటి ఫిర్యాదులు వచ్చినప్పటికీ సంబంధిత అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికైనా జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి ఎరువుల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని రైతులు కోరుతున్నారు. రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులపై సమగ్ర విచారణ చేపట్టి, నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
