రాయలసీమ రైల్వే ప్రయాణికులకు శుభవార్త. గుంటూరు-గుంతకల్లు రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టులో భాగంగా నంద్యాల-గాజులపల్లి మధ్య 15.121 కిలోమీటర్ల పొడవున నిర్మించిన రెండో రైల్వే లైన్ అందుబాటులోకి వచ్చింది. ఈ నెల 6న దక్షిణ కోస్తా రైల్వే అధికారులు ఈ మార్గాన్ని ప్రారంభించారు. గతంలో నిర్వహించిన స్పీడ్ టెస్టులు విజయవంతం కావడంతో రైళ్ల రాకపోకలకు అనుమతించారు. ప్రస్తుతం గంటకు 100 కిలోమీటర్ల వేగంతో రైళ్లు నడిపేందుకు అనుమతి ఇచ్చారు.

ఈ కొత్త రైల్వే లైన్‌లో ఒక ప్రధాన బ్రిడ్జితో పాటు 17 చిన్న వంతెనలను నిర్మించారు. నందిపల్లి వద్ద సరుకు రవాణా కోసం లోడింగ్, అన్‌లోడింగ్ ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేశారు. అలాగే ఆరు కొత్త లూప్ లైన్లు, మూడు హైలెవెల్ ప్యాసింజర్ ప్లాట్‌ఫామ్‌లు, ఒక ఫుట్ ఓవర్ బ్రిడ్జిని నిర్మించారు. గాజులపల్లి, నందిపల్లి స్టేషన్లలో కొత్త భవనాలను కూడా ఏర్పాటు చేశారు.

ఈ డబుల్ లైన్ అందుబాటులోకి రావడంతో గుంటూరు-గుంతకల్లు మార్గంలో రైళ్ల క్రాసింగ్ కోసం ఎదురుచూసే సమయం తగ్గనుంది. ప్రయాణికుల రైళ్లతో పాటు గూడ్స్ రైళ్ల రాకపోకలు కూడా సులభతరం కానున్నాయి. భవిష్యత్తులో మరిన్ని రైళ్లను నడిపేందుకు అవకాశం ఏర్పడుతుందని అధికారులు భావిస్తున్నారు.

మొత్తం 401 కిలోమీటర్ల గుంటూరు-గుంతకల్లు డబ్లింగ్ ప్రాజెక్టులో ఇప్పటివరకు 374 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. అంటే సుమారు 93.27 శాతం పనులు పూర్తయినట్లే. మరో 27 కిలోమీటర్ల పనులు పూర్తయితే ఈ రైల్వే కారిడార్ మొత్తం డబుల్ లైన్‌గా మారనుంది. దీంతో రాయలసీమతో పాటు ఈ మార్గంలో ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *