
సిద్ధిపేట వేదికగా గురువారం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన ప్రసంగంలో తన రాజకీయ ప్రత్యర్థులపై తీవ్ర విమర్శలు చేశారు. అదే సమయంలో సొంత పార్టీలోని కొందరు నేతల తీరుపైనా అసంతృప్తి వ్యక్తం చేశారు.
పదేపదే తనకు ఇబ్బంది కలిగిస్తున్న సొంత పార్టీ నాయకులనూ సీఎం వదల్లేదు. ఈ సందర్భంగా ప్రముఖ నటుడు చిరంజీవి చెప్పిన ‘చెడు చెవిలో.. మంచి మైకులో చెప్పాలి’ అనే మాటలను గుర్తుచేశారు. నాయకులు బహిరంగ వేదికలపై ఎలా మాట్లాడాలి? తమ వ్యాఖ్యల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే అంశాలపై పార్టీ నేతలకు సూచనలు చేశారు.
సిద్ధిపేటలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థులైన హరీశ్ రావు, కేసీఆర్, కేటీఆర్‌లపై విమర్శలు గుప్పించారు. ఇదే సమయంలో సొంత పార్టీ నేతల తీరుపైనా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. కొందరు నాయకులు వ్యవహరిస్తున్న తీరును ప్రస్తావిస్తూ చురకలు అంటించారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘చేయనిది ఏమైనా ఉంటే చెప్పండి.. చేయాల్సింది ఏమైనా ఉంటే చెప్పండి. చేసిన మంచి ఉంటే మీరు ఊరంతా చెప్పండి. వెనకటికి పెద్దోళ్లు చెప్పిర్రు.. చెడు చెవిలో చెప్పాలే, మంచి మైకులో చెప్పాలని.
కానీ నిన్న మొన్న మా వాళ్లలో కొంతమందికి ఏమైందో, ఎర్రి కుక్క కరిసిందో తెలియదు.. చెడంతా మైకులో చెబుతున్నారు. మంచిని మాత్రం ఇంటికి వచ్చి నా చెవిలో చెబుతున్నారు. ఇలాంటి కొంతమంది ఎర్రోళ్లు, ఎర్రి కుక్క కరిసినోళ్లు ఉంటారు. వాళ్లను కాంగ్రెస్ కార్యకర్తలు ఎలాగో ఎర్రగడ్డకు తీసుకెళ్తారు’’ అంటూ వ్యాఖ్యానించారు.
సొంత పార్టీ నాయకులను ఉద్దేశించి సీఎం చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సిద్ధిపేట సభలో సీఎం రేవంత్ రెడ్డి సొంత పార్టీ నేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిని ఉద్దేశించే సీఎం ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇటీవల ఓ సభలో రాజగోపాల్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘నువ్వేం ముఖ్యమంత్రివి? నీ భాష ఏంటి? కొడంగల్‌కు రూ.10 వేల కోట్లు తీసుకెళ్తానంటున్నావ్ కదా.. మునుగోడు నియోజకవర్గానికి నిధులు అడగొద్దా? అధికారం ఉంది కదా అని నేనేం చేసినా నడుస్తుందని అనుకుంటే ఖబడ్దార్ బిడ్డా.. యుద్ధం మొదలవుతుంది. మూడేళ్ల పాలన తర్వాత తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరు. తెలంగాణ అంటే కొడంగల్, మధిర మాత్రమే కాదు’’ అంటూ వ్యాఖ్యానించారు.
మరోవైపు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి కూడా ఇటీవల ప్రభుత్వ అధికారులపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. రాజకీయ నాయకుల కంటే ప్రభుత్వ అధికారులే ఎక్కువ అవినీతికి పాల్పడుతున్నారని, అధికారులు తీసుకునే లంచాల వల్లే తమ ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని ఆరోపించారు.
గతంలో జడ్చర్ల నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం లేదంటూ కూడా ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైతే 30 వేల మందితో ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని హెచ్చరించారు. ‘నేను చస్తేనే నిధులు విడుదల చేస్తారా?’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రుల నియోజకవర్గాలకే అభివృద్ధి పనుల బిల్లులు మంజూరు చేస్తే మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రైతుల ప్రయోజనాల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో సిద్ధిపేట సభలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి అన్నదానిపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. అయితే సీఎం పేర్లు ప్రస్తావించకపోవడంతో ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించాయన్నది స్పష్టత రావాల్సి ఉంది.
మంచి ఉంటే మైకులో చెప్పండి.. చెడు ఉంటే చెవిలో చెప్పండి’ అనే మాటను గతంలో మెగాస్టార్ చిరంజీవి ఉపయోగించారు. 2020 జనవరిలో జరిగిన ‘మా’ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌లో ఎన్ని విభేదాలు, సమస్యలు ఉన్నా వాటిని బహిరంగంగా చర్చకు పెట్టకుండా, సభ్యులంతా కలిసి కూర్చొని పరిష్కరించుకోవాలని సూచించారు. మంచి విషయాలను అందరి ముందు చెప్పుకోవాలని, సమస్యలు లేదా లోపాలు ఉంటే వ్యక్తిగతంగా మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని చిరంజీవి హితవు పలికారు.
ఇప్పుడు అదే మాటలను సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నేతలకు గుర్తుచేయడం రాజకీయంగా ఆసక్తికరంగా మారింది. పార్టీలోని అంతర్గత విభేదాలను బహిరంగ వేదికలపై ప్రస్తావించకుండా, పార్టీ వేదికలపైనే చర్చించుకోవాలని ఆయన పరోక్షంగా సూచించినట్లు చర్చ జరుగుతోంది. తన సూచనలను పట్టించుకోకపోతే కఠినంగా వ్యవహరించాల్సి వస్తుందనే సంకేతాలను కూడా తన వ్యాఖ్యల ద్వారా ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
మరోవైపు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కూడా ప్రభుత్వంపై పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేతలు చేస్తున్న వ్యాఖ్యలను పార్టీ నిశితంగా గమనిస్తోందని తెలిపారు. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పార్టీ అధిష్ఠానం దృష్టి సారించిందని వెల్లడించారు.
మరి సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో కాంగ్రెస్ నేతలు తమ వైఖరిని మార్చుకుంటారా? పార్టీలో అంతర్గత విభేదాలకు ఎలాంటి పరిష్కారం లభిస్తుంది? అనేది రానున్న రోజుల్లో తేలనుంది.
