
D news:nov:16మహిళల్లో రొమ్ము క్యాన్సర్ అత్యంత సాధారణ క్యాన్సర్‌గా కొనసాగుతోంది. 2022లో దేశవ్యాప్తంగా సుమారు 1,92,020 కొత్త కేసులు నమోదయ్యాయి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ 1,27,526 కేసులతో రెండో స్థానంలో ఉండగా, అండాశయ క్యాన్సర్ 47,333 కేసులతో తర్వాతి స్థానంలో ఉంది. పట్టణ ప్రాంతాల్లో ఆలస్యంగా వివాహం చేసుకోవడం, ప్రసవ వయసులో మార్పులు, ఆలస్యంగా పిల్లలను కనడం, ఆహారపు అలవాట్లలో మార్పులు వంటి అంశాలు రొమ్ము క్యాన్సర్ ప్రమాదంతో సంబంధం కలిగి ఉన్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్‌పై అవగాహన కొరవడటం, హెచ్‌పీవీ టీకాపై సమాచారం లేకపోవడం, స్క్రీనింగ్ పరీక్షలు అందుబాటులో లేకపోవడం వల్ల గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ను ఆలస్యంగా గుర్తించే పరిస్థితులు నెలకొంటున్నాయి.
పురుషుల్లో నోటి క్యాన్సర్ల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. 2022లో పెదవులు, నోటి కుహర క్యాన్సర్లకు సంబంధించి సుమారు 1,07,812 కొత్త కేసులు నమోదయ్యాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్ 58,970 కేసులు, అన్నవాహిక క్యాన్సర్ 45,608 కేసులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పొగాకు నమలడం, గుట్కా, ఇతర పొగలేని పొగాకు ఉత్పత్తుల వినియోగం, ధూమపానం ఈ క్యాన్సర్లకు ప్రధాన ప్రమాద కారకాలుగా ఉన్నాయి.
వయసు పెరిగే కొద్దీ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన వారిలో క్యాన్సర్ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. వయసుతోపాటు శరీర కణాల్లో జన్యుపరమైన మార్పులు పేరుకుపోవడం, పొగాకు, కాలుష్యం వంటి ప్రమాద కారకాలకు దీర్ఘకాలం గురికావడం ఇందుకు కారణాలుగా చెప్పవచ్చు. వృద్ధ పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్, రుతుక్రమం ఆగిన మహిళల్లో రొమ్ము క్యాన్సర్ సహా కొన్ని హార్మోన్ సంబంధిత క్యాన్సర్ల ప్రమాదం పెరుగుతుంది.
పొగాకు వినియోగంతోపాటు అధికంగా శుద్ధి చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, ఊబకాయం, జీవక్రియ సంబంధిత సమస్యలు కూడా కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతాయి. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక క్యాన్సర్ ఆసుపత్రులు, ఆధునిక నిర్ధారణ పరీక్షలు, నిపుణులైన వైద్యులు అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది. దీంతో రోగులు మెరుగైన చికిత్స కోసం నగరాలకు వెళ్లాల్సి వస్తోంది. ప్రయాణం, వైద్య ఖర్చులు, ఉపాధికి దూరం కావడం వంటి పరిణామాలు బాధిత కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. దేశంలో 70 శాతానికి పైగా క్యాన్సర్ కేసులు ముదిరిన దశలోనే గుర్తిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
క్యాన్సర్ ముప్పును తగ్గించడంతోపాటు మరణాల సంఖ్యను నియంత్రించాలంటే నివారణ, ముందస్తు గుర్తింపు, అందుబాటులో ఉండే వైద్య సేవలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలోనే రొమ్ము, గర్భాశయ ముఖద్వార, నోటి క్యాన్సర్లకు సంబంధించిన స్క్రీనింగ్ పరీక్షలను విస్తృతం చేయాలి. దీనివల్ల వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించి సకాలంలో చికిత్స అందించే అవకాశం ఉంటుంది. పొగాకు వినియోగాన్ని నియంత్రించడం, ప్రజల్లో అవగాహన పెంచడం, హెచ్‌పీవీ టీకా కార్యక్రమాలను మరింత విస్తరించడం కూడా కీలకం.
ప్రాంతీయ ఆరోగ్య కేంద్రాల్లో ప్రాథమిక పరీక్షలు, అవసరమైన చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటూ, వాటిని ప్రత్యేక క్యాన్సర్ ఆసుపత్రులతో అనుసంధానించాలి. తద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా నాణ్యమైన వైద్య సేవలు చేరువవుతాయి. క్యాన్సర్ అనేది కేవలం వయసు లేదా జీవనశైలికి సంబంధించిన సమస్య మాత్రమే కాదు. లింగం, వయసు, నివాస ప్రాంతం, వ్యాధిపై అవగాహన, వైద్య సేవల లభ్యత, చికిత్స ఖర్చులను భరించే ఆర్థిక సామర్థ్యం వంటి అనేక అంశాలు వ్యాధి నిర్ధారణ, చికిత్స ఫలితాలను ప్రభావితం చేస్తాయి. అందుకే క్యాన్సర్‌పై ప్రజల్లో అవగాహన పెంచడంతోపాటు అందరికీ సమానంగా వైద్య సేవలు అందేలా ప్రభుత్వాలు, వైద్య వ్యవస్థలు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉంది.
