శ్రీ సత్యసాయి బ్యూరో, D news: విద్యార్థులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రహదారి పక్కన ఉన్న పొలంలోకి దూసుకెళ్లిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. కడుపులయపాళ్యం గ్రామ సమీపంలోని మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది.

స్థానికుల వివరాల ప్రకారం.. నాచేపల్లి నుంచి గుడిబండ మీదుగా జవనడుకు, రామాయహట్టి, కడుపులయపాళ్యం గ్రామాల మీదుగా బస్సు మడకశిర వైపు వెళ్తోంది. కడుపులయపాళ్యం సమీపంలోని మలుపు వద్దకు చేరుకోగానే డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో బస్సు రోడ్డు పక్కన ఉన్న పొలంలోకి దూసుకెళ్లింది.

ప్రమాద సమయంలో బస్సులో సుమారు 100 నుంచి 150 మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. బస్సు అదుపుతప్పడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఒక విద్యార్థికి కాళ్లు విరిగినట్లు ప్రాథమిక సమాచారం. మరికొందరికి గాయాలయ్యాయా అనే విషయం తెలియాల్సి ఉంది.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని విద్యార్థులను బస్సు నుంచి బయటకు తీసేందుకు సహకరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. గాయపడిన విద్యార్థులను సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.

ప్రమాదానికి బస్సు అతివేగం, డ్రైవర్‌ నిర్లక్ష్యం లేదా మలుపు వద్ద రహదారి పరిస్థితులు కారణమా అనే కోణంలో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడికానున్నాయి.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *