
పంచాయతీరాజ్ శాఖ ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సాధిక్ ఖాన్‌కు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు అతన్ని కాకినాడ సబ్‌జైలుకు తరలించారు. మరోవైపు సాధిక్ ఖాన్‌ను వారం రోజుల పోలీస్ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సర్పవరం పోలీసులు మంగళవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.
ఘటన అనంతరం పరారీలో ఉన్న సాధిక్ ఖాన్‌ను ప్రత్యేక పోలీసు బృందాలు ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో అరెస్ట్ చేశాయి. అనంతరం అతన్ని కాకినాడకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది.
పోలీసుల నుంచి తప్పించుకునేందుకు సాధిక్ ఖాన్ పలు రాష్ట్రాల్లో మకాం మార్చినట్లు పోలీసులు గుర్తించారు. క్రెడిట్, డెబిట్ కార్డులు వినియోగించకుండా, మొబైల్ ఫోన్‌కు దూరంగా ఉంటూ తన ఆచూకీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు సమాచారం. పాత పరిచయాల సహాయంతో ఐదు రోజుల్లో నాలుగు రాష్ట్రాలు మారినట్లు తెలుస్తోంది. అయితే ఒక కీలక క్లూ ఆధారంగా ప్రత్యేక బృందాలు అతని ఆచూకీ గుర్తించి మీరట్‌లో అదుపులోకి తీసుకున్నాయి.
ఈ కేసు వివరాలను కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ సోమవారం మీడియాకు వెల్లడించారు. నూకరాజు, ఆయన కుమార్తె సౌజన్య రాసిన రెండు సూసైడ్ నోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నూకరాజు వద్ద ఒకటి, సౌజన్య స్కూటీలో మరొకటి లభించాయని చెప్పారు. సాధిక్ ఖాన్ వేధింపుల కారణంగానే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు ఆ నోట్లలో పేర్కొన్నారని ఎస్పీ వివరించారు.
సౌజన్యను మతం మార్చుకోవాలని సాధిక్ ఖాన్ ఒత్తిడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని ఎస్పీ తెలిపారు. సౌజన్య మామ భాస్కర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సర్పవరం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
సాధిక్ ఖాన్‌పై మరికొన్ని ఆరోపణలు కూడా వచ్చినట్లు ఎస్పీ బిందుమాధవ్ వెల్లడించారు. వాటిపైనా దర్యాప్తు కొనసాగుతోందని, ఆరోపణలు నిర్ధారణ అయిన తర్వాత పూర్తి వివరాలను వెల్లడిస్తామని తెలిపారు. సాధిక్ ఖాన్‌ను పోలీస్ కస్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు.
నూకరాజు కుటుంబం ఆత్మహత్యకు ముందు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని ఎస్పీ తెలిపారు. సమస్యలు ఎదురైనప్పుడు క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోకుండా పోలీసులను ఆశ్రయించాలని ప్రజలకు సూచించారు.

