
గోదావరి జిల్లాల ప్రజలకు పులస చేప అంటే ప్రత్యేకమైన అభిమానం. కొత్త నీరు వచ్చిన ప్రతిసారీ గోదావరిలోకి పులసలు చేరుతాయని, వాటి కోసం మత్స్యకారులతో పాటు చేపల ప్రియులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అయితే ఇటీవల కాలంలో గోదావరిలో పులసల రాక గణనీయంగా తగ్గిపోయింది. ఈ సీజన్‌లో అక్కడక్కడా ఒకటో రెండో పులసలు మాత్రమే లభిస్తున్నాయని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు.
ఈ సీజన్‌లో తొలి పులస చేప యానాం రేవులో ప్రత్యక్షమైంది. కోటిపల్లి సమీపంలోని గౌతమి గోదావరిలో చిక్కిన ఈ చేప సుమారు 1.250 కిలోల బరువు ఉండగా.. యానాం రేవులో జరిగిన వేలంలో రూ.14,500 ధర పలికింది. దీంతో పులసకు ఉన్న డిమాండ్, ధర మరోసారి చర్చనీయాంశంగా మారింది.
అయితే ఇదే సమయంలో పులస పేరుతో ఇతర చేపలను విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఒడిశా, పశ్చిమ బెంగాల్ నుంచి రోడ్డు మార్గంలో తీసుకొచ్చే ‘విలస’ చేపలను కొందరు పులస పేరుతో విక్రయిస్తున్నారని స్థానిక మత్స్యకారులు చెబుతున్నారు. గోదావరిలో పులసల లభ్యత తక్కువగా ఉండటంతో.. పులసపై ఉన్న ప్రజల సెంటిమెంట్‌ను ఆసరాగా చేసుకుని ఈ తరహా విక్రయాలు జరుగుతున్నాయని వారు ఆరోపిస్తున్నారు.
ఇటీవల పులస చేప ముక్కలను ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నామంటూ వచ్చిన ప్రకటనలపైనా అనుమానాలు వ్యక్తమయ్యాయి. గోదావరిలో పులసలు పెద్దగా లభించని సమయంలోనే తక్కువ ధరకు పులస ముక్కలు అందిస్తామంటూ ప్రచారం చేయడం అనుమానాలకు తావిచ్చింది. పరిశీలిస్తే అవి పులసలు కాకుండా ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన విలస చేపలని స్థానికులు చెబుతున్నారు.
పులస పేరుతో విక్రయిస్తున్న విలస చేపలను రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు విక్రయిస్తున్నారని మత్స్యకారులు ఆరోపిస్తున్నారు. గోదావరి ప్రాంతానికి దూరంగా ఉండే కొనుగోలుదారులు చేపను గుర్తించలేక పులసగానే భావించి అధిక ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
పులసల లభ్యత తగ్గిన నేపథ్యంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని స్థానిక మత్స్యకారులు సూచిస్తున్నారు. పులస పేరుతో విక్రయించే చేపలను కొనుగోలు చేసే ముందు అవి నిజంగా గోదావరిలో లభించిన పులసలేనా అనే విషయాన్ని నిర్ధారించుకోవాలని కోరుతున్నారు.

