
తిరుమలలో భక్తులకు అన్నప్రసాద వసతులను మరింత మెరుగుపరిచేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ప్రస్తుతం ఉన్న డైనింగ్ హాళ్లు భక్తుల రద్దీకి సరిపోకపోవడంతో అదనంగా ఐదో డైనింగ్ హాల్‌ను నిర్మిస్తోంది. ఇందుకోసం టీటీడీ రూ.4.5 కోట్ల నిధులను కేటాయించింది.
కొత్త డైనింగ్ హాల్ అందుబాటులోకి వస్తే ఒకేసారి ఎక్కువ సంఖ్యలో భక్తులు అన్నప్రసాదం స్వీకరించే అవకాశం కలుగుతుందని టీటీడీ భావిస్తోంది. దీంతో భక్తుల నిరీక్షణ సమయం తగ్గడంతో పాటు అన్నప్రసాద పంపిణీ మరింత సౌకర్యవంతంగా మారనుంది. ఈ నిర్మాణానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ ప్రతిరోజూ ఉచితంగా అన్నప్రసాదం అందిస్తోంది. రోజుకు సుమారు 90 వేల నుంచి లక్ష మంది వరకు భక్తులు ఈ అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్నారు. రోజురోజుకూ భక్తుల సంఖ్య పెరుగుతుండటంతో భవిష్యత్తులో రద్దీని దృష్టిలో పెట్టుకుని టీటీడీ అదనపు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఐదో డైనింగ్ హాల్ నిర్మాణ పనులను ప్రారంభించింది.
2011 జూలై 7న తిరుమలలో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో నాలుగు డైనింగ్ హాళ్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో హాల్లో సుమారు 2 వేల మంది భోజనం చేసే సదుపాయం ఉండగా.. నాలుగు హాళ్లలో కలిపి ఒకేసారి 8 వేల మంది వరకు అన్నప్రసాదం స్వీకరించవచ్చు. అయితే భక్తుల రద్దీ మరింత పెరుగుతున్న నేపథ్యంలో అదనంగా ఐదో డైనింగ్ హాల్‌ను నిర్మించాలని టీటీడీ నిర్ణయించింది.
తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంతో పాటు శ్రీఅక్షయ, వకుళామాత కిచెన్లలోనూ భక్తుల కోసం అన్నప్రసాదాలను తయారు చేస్తున్నారు. అయితే ఇటీవల భక్తుల రద్దీ గణనీయంగా పెరగడంతో వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలోని నాలుగు డైనింగ్ హాళ్లు సరిపోవడం లేదు. ఈ నేపథ్యంలో అన్నప్రసాద విభాగం ఉన్నతాధికారుల విజ్ఞప్తి మేరకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రత్యేక చొరవ తీసుకున్నారు.
వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి ఉత్తరం వైపున రూ.4.5 కోట్ల వ్యయంతో ఐదో డైనింగ్ హాల్ నిర్మాణ పనులు చేపట్టారు. ఇప్పటికే పునాది పనులు ప్రారంభమయ్యాయి. మొత్తం 5,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో గ్రౌండ్ ఫ్లోర్‌పై వెయిటింగ్ హాల్‌ను నిర్మించనున్నారు. అలాగే మొదటి అంతస్తును కూడా మరో 5,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ కొత్త హాల్లో అదనంగా సుమారు 500 మంది భక్తులు ఒకేసారి అన్నప్రసాదం స్వీకరించేలా ప్రణాళిక రూపొందించారు.
తిరుమల శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం
తిరుమల శ్రీవారి ఆలయంలో కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేక ఆస్థాన వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెల్లవారుజామున 4.30 నుంచి 5.45 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ఉగ్రశ్రీనివాసమూర్తి స్వామివారు ఆలయ మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.
వేంకటతురైవార్, స్నపనబేరం అని కూడా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి, భూదేవి సమేతంగా కేవలం కైశిక ద్వాదశి రోజున మాత్రమే సూర్యోదయానికి ముందుగా మాడ వీధుల్లో ఊరేగించడం విశేషం. అనంతరం స్వామివారు, అమ్మవార్లను బంగారు వాకిలి వద్దకు తీసుకువచ్చి వేంచేపు చేశారు. అర్చకులు పురాణ పఠనం నిర్వహించగా, కైశిక ద్వాదశి ఆస్థాన వేడుకలను ఆగమ శాస్త్ర ప్రకారం సంప్రదాయబద్ధంగా నిర్వహించారు.
పురాణాల ప్రకారం శ్రీవైష్ణవ క్షేత్రాల్లో నిర్వహించే విశిష్ట పర్వదినాల్లో కైశిక ద్వాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శ్రీ వరాహ పెరుమాళ్ కైశిక పురాణంలోని 82 శ్లోకాల ద్వారా భూదేవికి ఒక భక్తుడి కథను వివరించిన రోజును కైశిక ఏకాదశిగా పేర్కొంటారు. ఈ పురాణ గాథ ఆధారంగానే కైశిక ద్వాదశి ప్రత్యేకతను సంతరించుకుంది.
కైశిక ద్వాదశి వెనుక ఆసక్తికరమైన పురాణగాథ ఉంది. నంబదువాన్ (సత్యమూర్తి) అనే పరమ భక్తుడు స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను సమర్పించేందుకు ఆలయానికి బయలుదేరుతాడు. మార్గమధ్యంలో అతడికి ఓ బ్రహ్మరాక్షసుడు ఎదురై తనకు ఆహారంగా కావాలని కోరుతాడు. అయితే తాను ముందుగా శ్రీవారికి సంకీర్తనార్చన సమర్పించి తిరిగి వస్తానని, అప్పుడు అతడి ఆకలిని తీరుస్తానని నంబదువాన్ ప్రమాణం చేస్తాడు.
అన్న మాట ప్రకారం స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను సమర్పించిన అనంతరం బ్రహ్మరాక్షసుడి వద్దకు తిరిగి వస్తాడు. నంబదువాన్ భక్తికి, సత్యనిష్ఠకు ముగ్ధుడైన స్వామివారు అతడికి మోక్షాన్ని ప్రసాదించినట్లు పురాణగాథ చెబుతోంది. ఈ విశేష ఘట్టం కారణంగానే ఉత్తాన ద్వాదశికి కైశిక ద్వాదశి అనే పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది.
తిరుమలలో నిర్వహించిన ఈ వేడుకల్లో తిరుమల తిరుపతి దేవస్థానం పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, టీటీడీ పాలకమండలి చైర్మన్, ఈవో ముద్దాడ రవిచంద్ర, జేఈవో డాక్టర్ శరత్, సీవీఎస్వో మురళీకృష్ణతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
