
ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థ దేశంలోనే అగ్రస్థానానికి చేరుకుంటుందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అన్నారు. క్లాస్‌రూమ్ నుంచే సమాజంలో మార్పు తీసుకురావచ్చనే ఉద్దేశంతోనే విద్యాశాఖను ఎంచుకున్నట్లు తెలిపారు.
కాకినాడలోని చాగంటి కోటేశ్వరరావు గోశాల ప్రాంగణంలో విద్యార్థులతో నిర్వహించిన వ్యక్తిత్వ వికాస కార్యక్రమంలో లోకేశ్ పాల్గొని మాట్లాడారు. ఈ ఏడాది 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని, ఇంటర్‌లోనూ 10 వేల మంది అడ్మిషన్లు పెరిగాయని తెలిపారు.
విద్యార్థుల్లో విలువలతో కూడిన విద్యను పెంపొందించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. విద్యావ్యవస్థ రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆకాంక్షించారు. పాఠశాల యూనిఫాం, పుస్తకాలు, బ్యాగులు, బెల్టులు, షూస్‌లో రాజకీయ పార్టీల రంగులు ఉండకూడదనే ఉద్దేశంతో సీఎం, తన ఫొటోలను ముద్రించలేదని తెలిపారు.
ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చానని లోకేశ్ చెప్పారు. 2019 ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయినా నిరాశ చెందలేదన్నారు. మంగళగిరి తనకు సరైన నియోజకవర్గం కాదని పలువురు సూచించినప్పటికీ అక్కడే మళ్లీ పోటీ చేసి గెలిచిన విషయాన్ని ప్రస్తావించారు. తాను పడిపోయిన చోటే నిలబడతానని అప్పుడే సవాల్ చేశానని తెలిపారు.
