బోనాల పండుగ సందర్భంగా హాస్టల్‌ నుంచి ఇంటికి వచ్చిన 14 ఏళ్ల బాలిక హేమశ్రీ జలుబు, దగ్గుతో స్వల్ప అస్వస్థతకు గురైంది. దీంతో తల్లిదండ్రులు ఆమెను స్థానిక ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లారు. అయితే వైద్యం పేరుతో ఇంజక్షన్‌ ఇచ్చిన కొద్దిసేపటికే హేమశ్రీ స్పృహతప్పి మృతి చెందింది. ఆర్‌ఎంపీ ఇచ్చిన ఇంజక్షన్‌ కారణంగానే తమ కుమార్తె ప్రాణాలు కోల్పోయిందని ఆరోపిస్తూ బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.

ఖమ్మం, ఆగస్టు 11: బోనాల పండగ సందర్భంగా హాస్టల్‌ నుంచి ఇంటికి వచ్చిన ఓ బాలిక కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపింది. అయితే స్వల్పంగా జలుబు, దగ్గు రావడంతో చికిత్స కోసం స్థానిక ఆర్‌ఎంపీని ఆశ్రయించింది. ఆర్‌ఎంపీ ఇంజక్షన్‌ ఇచ్చిన కొద్దిసేపటికే బాలిక మృతి చెందడం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ విషాద ఘటన ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం బస్వాపురంలో సోమవారం చోటుచేసుకుంది. ఎస్సై సూరజ్‌, బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం..

బస్వాపురానికి చెందిన చల్లా రమేశ్‌, మౌనిక దంపతుల కుమార్తె హేమశ్రీ (14) స్థానిక కస్తూర్బా విద్యాలయంలో 8వ తరగతి చదువుతోంది. బోనాల పండగ సందర్భంగా హాస్టల్‌ నుంచి ఇంటికి వచ్చిన ఆమె కుటుంబ సభ్యులతో కలిసి జాతరలో ఉత్సాహంగా గడిపింది. అయితే ఆదివారం హేమశ్రీకి జలుబు, దగ్గు వంటి స్వల్ప అనారోగ్య లక్షణాలు కనిపించాయి. తిరిగి పాఠశాలకు వెళ్లాల్సి ఉండటంతో తల్లిదండ్రులు ఆమెను స్థానిక ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లారు.

కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ఆర్‌ఎంపీ హేమశ్రీకి ఇంజక్షన్‌ ఇచ్చారు. అనంతరం మరో ఇంజక్షన్‌ ఇస్తుండగా బాలిక ఒక్కసారిగా స్పృహతప్పి నోటి నుంచి నురగ వచ్చింది. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. హేమశ్రీ ఊపిరాడక ఇబ్బంది పడుతుండటంతో వెంటనే ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.