రాగి బూరెలు మన సంప్రదాయ వంటకాల్లో ప్రత్యేకమైనవి. రాగిలో ఉండే పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. అయితే వీటిని మెత్తగా, పొంగేలా తయారు చేయడం చాలామందికి కాస్త కష్టంగా అనిపిస్తుంది. పిండి కలపడం దగ్గర నుంచి పెనంపై కాల్చే వరకు సరైన పద్ధతిని పాటిస్తే బూరెలు మెత్తగా, రుచిగా, చక్కగా పొంగేలా వస్తాయి. కొన్ని సింపుల్ చిట్కాలను పాటిస్తూ ప్రతిసారీ పర్ఫెక్ట్‌గా రాగి బూరెలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

రాగి బూరెలు మన సంప్రదాయ వంటకాల్లో ప్రత్యేకమైనవి. రాగిపిండితో తయారు చేసే ఈ బూరెలు రుచితో పాటు పోషక విలువలను కూడా అందిస్తాయి. అయితే బూరెలు మెత్తగా, పొంగుతూ రావాలంటే పిండి కలపడం దగ్గర నుంచి నూనెలో వేయించే వరకు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. సరైన పద్ధతిలో తయారు చేస్తే ఇంట్లోనే ఎంతో రుచికరమైన, మెత్తటి రాగి బూరెలను సులభంగా చేసుకోవచ్చు.

కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు రాగిపిండి, ఒక కప్పు గోధుమపిండి, ఒక కప్పు బెల్లం తురుము, పావు కప్పు నీరు, పావు కప్పు ఎండు కొబ్బరి తురుము, రెండు టీస్పూన్ల నువ్వులు, ఒక టీస్పూన్ యాలకుల పొడి, ఒక టేబుల్‌స్పూన్ చక్కెర పొడి, కొద్దిగా ఉప్పు, వేయించడానికి సరిపడా నూనె.

పిండి తయారీ: ముందుగా ఒక గిన్నెలో రాగిపిండి, గోధుమపిండి తీసుకుని బాగా కలపాలి. ఇందులో కొద్దిగా ఉప్పు, ఎండు కొబ్బరి తురుము, నువ్వులు, యాలకుల పొడి వేసి మరోసారి కలపాలి. అనంతరం స్టవ్‌పై పాన్ పెట్టి బెల్లం తురుము, పావు కప్పు నీరు వేసి మీడియం మంటపై బెల్లం పూర్తిగా కరిగే వరకు వేడి చేయాలి. బెల్లం పాకం పట్టాల్సిన అవసరం లేదు.. కరిగితే సరిపోతుంది.

బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, ఆ నీటిని వడగట్టి పిండి మిశ్రమంలో పోయాలి. బెల్లం నీరు వేడిగా ఉంటుంది కాబట్టి ముందుగా స్పూన్‌తో కలిపి, ఆ తర్వాత చేత్తో మెత్తగా కలుపుకోవాలి. అవసరమైతే కొద్దికొద్దిగా నీటిని జోడిస్తూ మెత్తటి ముద్దలా చేసుకోవాలి. పిండి మరీ గట్టిగా ఉండకూడదు. కొద్దిగా మెత్తగా, లూజ్‌గా ఉంటేనే బూరెలు బాగా పొంగి, లోపల మెత్తగా వస్తాయి.

బూరెలు ఒత్తడం: పిండి సిద్ధమైన తర్వాత చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. వాటిని కవర్ లేదా నూనె రాసిన ప్లాస్టిక్ షీట్‌పై పెట్టి బూరెల ఆకారంలో ఒత్తాలి. మరీ పలుచగా కాకుండా కొద్దిగా మందంగా ఉండేలా ఒత్తుకోవాలి. పలుచగా చేస్తే బూరెలు పొంగకుండా గట్టిగా మారే అవకాశం ఉంటుంది.

వేయించే విధానం: కడాయిలో బూరెలు మునిగేంత నూనె పోసి బాగా వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ఒక్కో బూరెను జాగ్రత్తగా వేసి వేయించాలి. బూరెను నూనెలో వేసిన వెంటనే గరిటెతో పైభాగంపై వేడి నూనెను పోస్తూ ఉంటే బాగా పొంగుతుంది. ఒక బూరె పైకి తేలిన తర్వాత మరో బూరెను వేయాలి. రెండు వైపులా మంచి బంగారు రంగు వచ్చే వరకు వేయించి, తీసి నూనె వడగట్టాలి.

ఇలా కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే రాగి బూరెలు బయటకు కరకరలాడుతూ, లోపల మెత్తగా మరియు చక్కగా పొంగుతూ వస్తాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *