ఆంధ్రప్రదేశ్‌ టిఫిన్‌ వంటకాల్లో ‘నెల్లూరు వెన్న కారం దోశ’కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఎర్రగా, కరకరలాడే దోశపై వేడివేడిగా కరిగే తాజా వెన్న, ఘాటైన ఉల్లిపాయ ఎర్రకారం.. వీటికి తోడు పల్లీ చట్నీ లేదా గట్టి చట్నీ కాంబినేషన్‌ కలిస్తే ఆ రుచి మరింత అదిరిపోతుంది. ఒక్కసారి రుచి చూస్తే ఆ ఫ్లేవర్‌ను మర్చిపోవడం అంత ఈజీ కాదు.

హోటళ్లలో, ముఖ్యంగా నెల్లూరు రోడ్‌సైడ్‌ బండ్లపై దొరికే ఈ దోశకు ఉండే రుచి ఇంట్లో ఎందుకు రావడం లేదని చాలామంది అనుకుంటుంటారు. అయితే సరైన పిండిని సిద్ధం చేసుకోవడంతో పాటు కారం, వెన్న, దోశను వేసే విధానంలో కొన్ని చిన్న చిట్కాలు పాటిస్తే ఇంట్లోనూ నెల్లూరు స్టైల్‌లో కరకరలాడే వెన్న కారం దోశను తయారు చేసుకోవచ్చు.

నెల్లూరు స్పెషల్ వెన్న కారం దోశ రుచి ఇంట్లోనూ ఆస్వాదించాలంటే పిండి కొలతల దగ్గర నుంచి దోశను కాల్చే విధానం వరకు ప్రతి దశలోనూ జాగ్రత్త అవసరం. ముఖ్యంగా దోశకు మంచి రంగు, కరకరలాడే టెక్స్చర్ రావడానికి మినపపప్పుతో పాటు శనగపప్పు, మెంతులు, అటుకులు వంటి పదార్థాలను సరైన మోతాదులో ఉపయోగించాలి.

1. దోశ పిండి తయారీ:
ఒక గ్లాసు మినపగుళ్లు, 3 గ్లాసుల బియ్యం, పావు గ్లాసు పచ్చి శనగపప్పు, 2 టీస్పూన్ల మెంతులు, అర గ్లాసు దొడ్డు అటుకులు తీసుకోవాలి. వీటిని శుభ్రంగా కడిగి కనీసం 3 గంటలు నానబెట్టాలి. అనంతరం కొద్దికొద్దిగా నీటిని కలుపుతూ మెత్తగా, కాస్త చిక్కగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండిని 8 గంటలు లేదా రాత్రంతా పులియబెట్టుకోవాలి.

2. నెల్లూరు ఎర్ర కారం:
ఉల్లిపాయలు, ఎండుమిర్చి లేదా కారం, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, తగినంత ఉప్పు వేసి రోట్లో లేదా మిక్సీలో కాస్త కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. ఇలా తయారైన ఘాటైన ఎర్ర కారంతో పాటు గట్టి పల్లీ చట్నీని కూడా సిద్ధంగా ఉంచుకోవాలి.

3. దోశ వేసే విధానం:
దోశ పెనాన్ని బాగా వేడిచేసి, మంటను మీడియంలో ఉంచాలి. ఒక గరిటెడు పిండిని పోసి పలుచగా, గుండ్రంగా పరిచి కాల్చాలి. దోశ కాస్త వేగిన తర్వాత ఎర్ర కారాన్ని ఒక చెంచా తీసుకుని అంతటా సమానంగా పూయాలి. ఆపై పల్లీ చట్నీని పలుచగా స్ప్రెడ్ చేసి, తాజా వెన్న లేదా పాలమీగడను పైన వేయాలి.

4. క్రిస్పీగా కాల్చడం:
వెన్న వేడికి కరిగి దోశ అంతటా వ్యాపించడంతో మంచి గోల్డెన్ బ్రౌన్ రంగు వచ్చి కరకరలాడేలా అవుతుంది. మరింత క్రిస్పీగా కావాలంటే దోశను పెనంపై కొద్దిసేపు ఎక్కువగా కాల్చుకోవచ్చు. చట్నీని దోశలో వేయడం ఇష్టం లేకపోతే ఎర్ర కారం, వెన్న మాత్రమే వేసి క్రిస్పీగా కాల్చి, పల్లీ చట్నీతో విడిగా సర్వ్ చేసుకోవచ్చు.

వేడివేడిగా పెనం మీద నుంచి తీసిన నెల్లూరు వెన్న కారం దోశను పల్లీ చట్నీతో కలిపి తింటే ఘాటు, వెన్న రుచి, కరకరలాడే దోశ కలయికతో అదిరిపోయే టేస్ట్‌ను ఆస్వాదించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *