బరువును నియంత్రించుకోవడంతో పాటు అధిక బరువు, బ్లడ్ షుగర్‌ను మేనేజ్ చేయడంలో టైమ్-రిస్ట్రిక్టెడ్ ఈటింగ్ (Time-Restricted Eating) కీలకంగా ఉండొచ్చని తాజా అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇందులో ఏం తింటున్నామనేది మాత్రమే కాకుండా, రోజులో ఎప్పుడు ఆహారం తీసుకుంటున్నామనేది కూడా ముఖ్యమని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే, బరువు తగ్గే విషయంలో ఆహారం తీసుకునే సమయంతో పాటు, రోజులో తినే సమయ వ్యవధిని తగ్గించడం కూడా కొంతమేర ప్రయోజనకరంగా ఉండొచ్చని ఆధారాలు సూచిస్తున్నాయి. మరి టైమ్-రిస్ట్రిక్టెడ్ ఈటింగ్‌ వల్ల నిజంగా ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? దీన్ని ఎలా పాటించాలి? పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఈ అధ్యయనం కొన్ని ముఖ్యమైన విషయాలను వెల్లడించింది. అధిక బరువు, ప్రీడయాబెటిస్ ఉన్నవారిలో టైమ్-రిస్ట్రిక్టెడ్ డైట్ వల్ల బరువు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ, సాధారణ డైట్‌తో పోలిస్తే గణనీయమైన అదనపు ప్రయోజనం కనిపించలేదు. అధ్యయనంలో పాల్గొన్నవారిని సాధారణ ఆహారం తీసుకునే గ్రూప్, రోజుకు 10 గంటల సమయ పరిమితిలో ఆహారం తీసుకునే గ్రూప్‌గా విభజించారు. రెండు గ్రూపులూ దాదాపు సమానమైన కేలరీలను తీసుకున్నాయి. 12 వారాల తర్వాత రెండు గ్రూపుల్లోనూ బరువు తగ్గినప్పటికీ, బరువు తగ్గడంలో స్పష్టమైన తేడా కనిపించలేదు. అలాగే, రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు, జీవక్రియకు సంబంధించిన ఇతర కొలతల్లోనూ గణనీయమైన వ్యత్యాసం నమోదు కాలేదు. ఈ విషయాలను ఆస్టర్ వైట్‌ఫీల్డ్ హాస్పిటల్‌లోని క్లినికల్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ విభాగం చీఫ్ క్లినికల్ డైటీషియన్ అండ్ హెచ్‌ఓడీ శ్రీమతి వీణా వి వివరిస్తున్నారు.

జాన్ హాప్కిన్స్ పరిశోధకులు ఊబకాయం, ప్రీడయాబెటిస్, టైప్‌-2 డయాబెటిస్ ఉన్నవారిపై 12 వారాల పాటు అధ్యయనం చేశారు. ఇందులో ప్రత్యేకంగా కేలరీలను తగ్గించకపోయినా.. ఆహారం తీసుకునే సమయంపై నియంత్రణ పాటించినవారిలో కొంతమేర బరువు తగ్గినట్లు గుర్తించారు. అంతేకాకుండా, టైమ్‌-రిస్ట్రిక్టెడ్ డైట్‌ పాటించడం వల్ల అతిగా తినే అలవాటు తగ్గడం, ఆకలిని నియంత్రించుకోవడంలో మెరుగుదల వంటి సానుకూల మార్పులు కూడా కనిపించినట్లు పరిశోధకులు తెలిపారు.

కేలరీల కంట్రోల్

పరిశోధన ప్రకారం, సాధారణంగా ఆహారం తీసుకునే వారితో పోలిస్తే టైమ్ రిస్ట్రిక్టెడ్ డైట్ పాటించేవారు కేలరీలను ప్రత్యేకంగా లెక్కించకపోయినా, తినే సమయాన్ని పరిమితం చేసుకోవడం వల్ల రోజులో సహజంగానే తక్కువ కేలరీలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఫలితంగా బరువు తగ్గడంలో ఇది సహాయపడవచ్చు. అందుకే బరువు నియంత్రణలో ఏం తింటున్నామన్నదే కాకుండా, ఎప్పుడు తింటున్నామనేది కూడా కీలకంగా మారుతుంది.

బెనిఫిట్స్ ఏంటంటే

శరీరం ముందుగా అందుబాటులో ఉన్న గ్లూకోజ్‌ను శక్తిగా ఉపయోగించుకుంటుంది. ఆ తర్వాత శరీరంలో నిల్వగా ఉన్న కొవ్వును శక్తి కోసం వినియోగించే ప్రక్రియ పెరగవచ్చు.

అయితే, టైమ్ రిస్ట్రిక్టెడ్ డైట్‌లో నచ్చిన ఆహారాన్ని పూర్తిగా మానేయడం కంటే.. ఆహారం తీసుకునే సమయాన్ని పరిమితం చేయడంపై ప్రధానంగా దృష్టి పెడతారు. అయితే ఇది అందరికీ ఒకే విధంగా సరిపోతుందని చెప్పలేం.

కొన్ని అధ్యయనాల్లో పరిమిత సమయాల్లో ఆహారం తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిలు, ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరుగుపడే అవకాశం ఉన్నట్లు సూచనలు ఉన్నాయి.

పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే

ఇటీవల జరిగిన కొన్ని పరిశోధనలు ఆహారం తీసుకునే సమయాన్ని పరిమితం చేసే టైమ్ రిస్ట్రిక్టెడ్ ఈటింగ్ విధానంతో కొన్ని ప్రయోజనాలు ఉండొచ్చని సూచిస్తున్నాయి. ఈ పద్ధతిలో రోజులో నిర్దిష్ట సమయ వ్యవధిలోనే ఆహారం తీసుకుంటారు. దీంతో కేలరీల తీసుకునే పరిమాణం సహజంగానే తగ్గే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఊబకాయం ఉన్నవారిపై నిర్వహించిన ఓ అధ్యయనంలో సాధారణ ఆహార విధానంతో పోలిస్తే, 10 గంటల టైమ్ రిస్ట్రిక్టెడ్ ఈటింగ్ పాటించినవారిలో బరువు తగ్గడం కనిపించింది. అయితే ఈ ఫలితాలు నిర్దిష్ట అధ్యయనాల్లో పాల్గొన్న వ్యక్తులపై ఆధారపడి ఉంటాయి. అందరికీ ఇదే విధంగా ఫలితం వస్తుందని చెప్పలేం.

సైంటిఫిక్‌గా చెప్పేదేంటంటే

టైమ్ రిస్ట్రిక్టెడ్ ఫుడ్‌ మన ఆహారపు అలవాట్లను క్రమబద్ధీకరించడంలో కొంతవరకు సహాయపడొచ్చు. ముఖ్యంగా అనవసరమైన చిరుతిళ్లు, లేట్ నైట్ డిన్నర్‌ను తగ్గించడం ద్వారా రోజువారీగా తీసుకునే మొత్తం కేలరీలు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే, తినే సమయంలోనూ తగినంత ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, మినరల్స్ వంటి సూక్ష్మ పోషకాలు అందేలా చూసుకోవడం చాలా ముఖ్యం.

అయితే టైమ్ రిస్ట్రిక్టెడ్ ఫుడ్ ఒక్కటే ఆరోగ్యకరమైన జీవనశైలికి ప్రత్యామ్నాయం కాదు. ఆహారం నాణ్యత, శారీరక శ్రమ, తగినంత నిద్ర, అలాగే ప్రీడయాబెటిస్ లేదా డయాబెటిస్ వంటి పరిస్థితుల్లో వైద్యుల సూచనలను కూడా తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. మొత్తంగా, సరైన పోషకాహారం తీసుకుంటూ, క్రమం తప్పకుండా శారీరకంగా చురుకుగా ఉంటూ, తగిన సమయాల్లో ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి మరింత ప్రయోజనకరం.