భారత జట్టుకు టీ20 ప్రపంచకప్ అందించిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రస్తుతం జాతీయ జట్టుకు దూరంగా ఉన్నాడు. కొంతకాలంగా ఫామ్ లేమితో ఇబ్బందిపడిన ఈ స్టార్ బ్యాటర్.. తాజాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో వరుస అర్ధశతకాలతో తిరిగి తన సత్తా చాటుతున్నాడు. అయితే దేశవాళీ క్రికెట్‌లో పరుగుల వరద పారిస్తున్నప్పటికీ.. టీమిండియాలోకి అతడి పునరాగమనం ఇప్పట్లో సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. జట్టులో తీవ్ర పోటీ ఉండటమే ఇందుకు కారణమని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుత ఎంపిక ప్రణాళికల్లో సూర్యకుమార్‌కు చోటు లేదని బీసీసీఐ వర్గాలు వెల్లడించినట్లు సమాచారం. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో యశస్వి జైస్వాల్‌కే తగిన అవకాశాలు కల్పించలేకపోతున్నామని పేర్కొన్నాయి. సూర్య దేశవాళీ టోర్నీలో అద్భుతంగా ఆడుతున్నప్పటికీ.. ప్రస్తుత జట్టులో అతడికి ఏ స్థానంలో అవకాశం కల్పించాలన్నదే ప్రధాన సమస్యగా మారిందని తెలిపాయి.

టాప్ ఆర్డర్ నుంచి మిడిలార్డర్ వరకు పోటీ

భారత జట్టులో ప్రస్తుతం ప్రతి స్థానానికి బలమైన పోటీ నెలకొంది. మొదట్లో పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో దూకుడుగా ఆడిన యశస్వి జైస్వాల్‌కు కూడా ఇప్పుడు అవకాశాలు తగ్గాయని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ వంటి ఆటగాళ్ల ప్రదర్శనతో జట్టు కూర్పులో మార్పులు చోటుచేసుకున్నాయని వివరించాయి. మిడిలార్డర్‌లోనూ స్థానం కోసం పలువురు ఆటగాళ్లు పోటీపడుతుండటంతో సూర్యకు అవకాశం కల్పించడం సవాలుగా మారిందని అభిప్రాయపడ్డాయి.

ముస్తాక్ అలీ ట్రోఫీలో సూర్య విధ్వంసం

మరోవైపు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో ముంబయి జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న సూర్యకుమార్ తన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటున్నాడు. హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో కేవలం 21 బంతుల్లోనే 60 పరుగులు చేశాడు. ఆ తర్వాత గుజరాత్‌తో జరిగిన పోరులో మరింత దూకుడుగా ఆడి 29 బంతుల్లో 82 పరుగులు సాధించాడు.

సూర్య మెరుపు ఇన్నింగ్స్‌తో ముంబయి జట్టు 199 పరుగుల లక్ష్యాన్ని కేవలం 15.4 ఓవర్లలోనే ఛేదించింది. వరుసగా భారీ స్కోర్లు సాధిస్తుండటంతో అతడి ఫామ్‌పై అభిమానుల్లో ఆశలు పెరిగాయి. అయితే ఈ ప్రదర్శన జాతీయ జట్టులోకి తిరిగి తీసుకొస్తుందా? లేదా? అన్నది సెలెక్టర్ల నిర్ణయంపై ఆధారపడి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *