వినాయక చవితి పండుగ వచ్చిందంటే చాలు.. ఇంటింటా పూజా ఏర్పాట్లతో పాటు స్వామివారికి ఇష్టమైన ప్రసాదాలను సిద్ధం చేయడంలో అందరూ బిజీ అవుతారు. అలాంటి ప్రసాదాల్లో పాలతాలికల పాయసానికి ప్రత్యేక స్థానం ఉంది. ఎంతో రుచికరంగా ఉండే ఈ పాయసాన్ని ఇంట్లోనే సులభంగా, పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ముందుగా పావు కప్పు సగ్గుబియ్యాన్ని శుభ్రంగా కడిగి గోరువెచ్చని నీటిలో నానబెట్టాలి. మరోవైపు ఒక గిన్నెలో ఒక కప్పు బెల్లం తురుము, అర కప్పు నీళ్లు వేసి బెల్లం పూర్తిగా కరిగే వరకు మరిగించాలి. దీనికి పాకం పట్టించాల్సిన అవసరం లేదు. బెల్లం కరిగిన తర్వాత సిరప్‌ను పూర్తిగా చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. పాయసంలో పాలు విరగకుండా ఉండాలంటే బెల్లం సిరప్ పూర్తిగా చల్లగా ఉండటం ముఖ్యం.
తర్వాత బెల్లం కొలిచిన కప్పుతో ముప్పావు కప్పు బియ్యపు పిండి తీసుకోవాలి. ఒక పాన్‌లో ముప్పావు కప్పు నీళ్లు, ఒక టేబుల్‌స్పూన్ బెల్లం తురుము వేసి వేడి చేయాలి. బెల్లం కరిగి నీళ్లు వేడెక్కగానే స్టవ్ ఆఫ్ చేయాలి. బియ్యపు పిండిలో ఒక టేబుల్‌స్పూన్ గోధుమపిండి కలిపి, ఈ మిశ్రమాన్ని వేడి నీటిలో వేసి బాగా కలపాలి. పిండి వేడిగా ఉన్నప్పుడే చేతిని తడుపుకుంటూ మెత్తగా కలుపుతూ సెమీ సాఫ్ట్‌గా ముద్ద చేసుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు చల్లుకోవచ్చు. ఇలా చేయడం వల్ల తాలికలు సులభంగా తయారవడంతో పాటు ఉడికేటప్పుడు చిరిగిపోకుండా ఉంటాయి.
ఈ పిండి ముద్దలోంచి చిన్న ఉసిరికాయ పరిమాణంలో కొంత పిండిని పాయసం చిక్కబడటానికి పక్కన పెట్టాలి. మిగిలిన పిండిని జంతికల గొట్టంలో వేసుకోవాలి. మెషిన్ అందుబాటులో లేకపోతే పిండిని చిన్న చిన్న భాగాలుగా తీసుకుని చేత్తో లేదా ప్లేట్‌పై సన్నగా తాలికల్లా ఒత్తుకోవచ్చు.
ఇప్పుడు వెడల్పాటి కడాయిలో రెండు కప్పుల నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు వేడెక్కిన తర్వాత నానబెట్టిన సగ్గుబియ్యం వేసి నాలుగైదు నిమిషాలు ఉడికించాలి. అనంతరం నాలుగు కప్పుల పాలు పోసి మరిగించాలి. పాలు మరుగుతున్నప్పుడు జంతికల గొట్టంతో తాలికలను నేరుగా పాలలోకి ఒత్తుతూ, చేత్తో కొద్దికొద్దిగా కట్ చేయాలి. ఇలా చేస్తే తాలికలు ఒకదానికొకటి అతుక్కోకుండా చక్కగా ఉడుకుతాయి. తాలికలన్నీ వేసిన తర్వాత మధ్య మధ్యలో నెమ్మదిగా కలుపుతూ మరో నాలుగైదు నిమిషాలు ఉడికించాలి.
పక్కన పెట్టిన పిండి ముద్దను కొద్దిగా నీటిలో కలిపి ఉండలు లేకుండా పలుచని పేస్ట్‌లా చేసుకోవాలి. తాలికలు ఉడికిన తర్వాత ఈ మిశ్రమాన్ని పాయసంలో వేసి మరో రెండు నిమిషాలు ఉడికించాలి. అనంతరం ఒక టేబుల్‌స్పూన్ తురిమిన పచ్చి కొబ్బరి వేసి కలపాలి.
తర్వాత స్టవ్ మంటను తగ్గించి లేదా ఆఫ్ చేసి, పూర్తిగా చల్లార్చిన బెల్లం సిరప్‌ను వడగట్టి పాయసంలో కలపాలి. బాగా కలిపి తక్కువ మంటపై సుమారు రెండు నిమిషాలు ఉడికించాలి. పాయసం చల్లబడే కొద్దీ మరింత చిక్కగా మారుతుంది.
చివరగా మరో పాన్‌లో రెండు మూడు టేబుల్స్పూన్ల నెయ్యి వేసి బాదం, జీడిపప్పు పలుకులను వేయించాలి. అవి బంగారు రంగులోకి మారిన తర్వాత కిస్మిస్లు వేసి వేయించాలి. వీటిని పాయసంలో కలిపి అర టీస్పూన్ యాలకుల పొడి జోడిస్తే రుచికరమైన పాలతాలికల పాయసం సిద్ధమవుతుంది.
