
అమరావతి, నవంబర్ 5: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోంది. అయితే ఉమ్మడి కడప జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాజకీయ ఘర్షణలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పులివెందుల, జమ్మలమడుగు నియోజకవర్గాల్లోని కొన్ని గ్రామాల్లో వైఎస్సార్సీపీ నాయకులు గొడవలకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. లింగాల మండలం పార్నపల్లెలో ఎంపీ అవినాశ్‌రెడ్డి నేతృత్వంలో వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారని టీడీపీ శ్రేణులు ఆరోపించాయి. గ్రామంలో ప్రశాంత వాతావరణాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించాయి.
మరోవైపు తుమ్మలపల్లెలోనూ టీడీపీ నాయకులపై వైసీపీ కార్యకర్తలు దాడులకు యత్నించారని ఆరోపణలు వచ్చాయి. జమ్మలమడుగు నియోజకవర్గంలోని గండ్లకుంటలో వైసీపీ నేత జమ్మలమడుగు రామసుబ్బారెడ్డి వ్యవహారశైలిపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలింగ్ కేంద్రాల్లో ఉన్న టీడీపీ ఏజెంట్లను బయటకు పంపించారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి.
తన సొంత గ్రామంలో టీడీపీ ఏజెంట్లు ఉండటానికి వీల్లేదంటూ రామసుబ్బారెడ్డి చెప్పడం వివాదానికి దారితీసిందని టీడీపీ నేతలు పేర్కొన్నారు. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజకీయంగా వెనుకబడటంతో వైసీపీ అసహనంతో దాడులకు కుట్ర చేస్తోందని కూటమి నాయకులు విమర్శించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి నేతలకు కీలక సూచనలు చేశారు. వైసీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలకు పాల్పడినా సంయమనం పాటించాలని, ఎలాంటి ఘర్షణలకు దిగకుండా ఎన్నికల ప్రక్రియకు సహకరించాలని సూచించారు.
మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా పరిషత్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుండగా, ఉమ్మడి కడప జిల్లాలో చోటుచేసుకున్న ఆరోపణలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
for more:Mptc zptc election ubdates only in dtv digital
