
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు వాతావరణశాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. రానున్న మూడు రోజుల పాటు రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్ర పరిసర ప్రాంతాల్లో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడే సూచనలు ఉన్నాయని తెలిపింది. ఈ ప్రభావంతో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేస్తోంది.
ఇటీవల ఏపీలో అర్నబ్, మురసు తుఫాన్ల ప్రభావంతో భారీ నష్టం వాటిల్లింది. వేలాది ఎకరాల్లో పంటలు దెబ్బతినడంతో పాటు రహదారులు, విద్యుత్ స్తంభాలు ధ్వంసమయ్యాయి. పలువురు ప్రజలు నిరాశ్రయులయ్యారు. మురసు తుఫాన్ ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రోజుల్లోనూ వర్షాలు కొనసాగవచ్చని వాతావరణశాఖ వెల్లడించింది.
వాతావరణశాఖ అంచనాల ప్రకారం దీపావళి తర్వాత నవంబర్ 11న ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడవచ్చని అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ అల్పపీడనం మరింత బలపడుతుందా లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.
ఏపీలోని ఈ జిల్లాలకు వర్ష సూచన
ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ ఎండీ, ఆర్టీజీఎస్ సీఈఓ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
శుక్రవారం అల్లూరి, పోలవరం, ఎన్టీఆర్, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే సూచనలు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఇక గురువారం విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం, నంద్యాల, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసినట్లు అధికారులు వెల్లడించారు.
భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఉధృతంగా ప్రవహించే వాగులు, కాలువలు, నీటిలో మునిగిపోయిన కాజ్‌వేలను దాటేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
తెలంగాణలో పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణలోనూ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచవచ్చని హెచ్చరించింది. మిగిలిన జిల్లాల్లోనూ అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొంది.
for more: Live Updates in DTV Digital
ప్రజలకు వాతావరణశాఖ సూచనలు
వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఉరుములు, మెరుపులు సంభవించే సమయంలో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల సమీపంలో నిలబడకూడదని సూచించారు. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
బంగాళాఖాతంలో ఏర్పడనున్న ఉపరితల ఆవర్తనం, దాని ప్రభావంతో ఏర్పడే అల్పపీడనంపై వాతావరణశాఖ తదుపరి అంచనాలు వెలువడే అవకాశం ఉంది.
