ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపరిచే దిశగా కీలక అడుగు పడుతోంది. విజయవాడలో కృష్ణా నదిపై మరో భారీ రైల్వే వంతెన నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే నదిపై రెండు రైల్వే బ్రిడ్జిలు ఉండగా.. ఇప్పుడు మూడో వంతెన కూడా అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR)ను అధికారులు సిద్ధం చేసి రైల్వే బోర్డుకు పంపించారు.

ఈ కొత్త వంతెన నిర్మాణం పూర్తయితే విజయవాడ మీదుగా రైళ్ల రాకపోకలు మరింత సులభం కానున్నాయి. ముఖ్యంగా రైళ్ల రద్దీ, ఆలస్యాలు తగ్గడంతో పాటు గూడ్స్ రైళ్ల రవాణాకు కూడా ప్రయోజనం కలగనుంది.

విజయవాడలో కృష్ణా నదిపై మూడో రైల్వే బ్రిడ్జి

విజయవాడ నుంచి సీతానగరం మధ్య ఈ కొత్త రైల్వే వంతెన నిర్మించేందుకు ప్రతిపాదించారు. సుమారు 1.30 కిలోమీటర్ల పొడవుతో నిర్మించనున్న ఈ బ్రిడ్జి విజయవాడ-కృష్ణా కెనాల్ రైల్వే స్టేషన్ల మధ్య ఉండనుంది.

బల్లార్ష-విజయవాడ-గూడూరు నాలుగో రైల్వే లైన్ ప్రాజెక్టులో భాగంగా ఈ వంతెన నిర్మాణం చేపట్టనున్నారు. బల్లార్ష నుంచి కాజీపేట వరకు, అక్కడి నుంచి విజయవాడ మీదుగా గూడూరు వరకు నాలుగో రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించారు.

విజయవాడ-గూడూరు మధ్య నాలుగో రైల్వే లైన్ నిర్మాణానికి సుమారు రూ.5,858 కోట్లు ఖర్చు చేయనున్నారు. దాదాపు 293 కిలోమీటర్ల మేర ఈ ప్రాజెక్టు విస్తరించనుంది. దీనికి సంబంధించిన డీపీఆర్‌లో కృష్ణా నదిపై మూడో రైల్వే వంతెన నిర్మాణాన్ని కూడా ప్రతిపాదించారు.

రైళ్ల రాకపోకలకు తగ్గనున్న అంతరాయం

ప్రస్తుతం విజయవాడలో కృష్ణా నదిపై రెండు రైల్వే వంతెనలు ఉన్నాయి. వీటిలో ఒకటి డబుల్ ట్రాక్‌తో, మరొకటి సింగిల్ ట్రాక్‌తో కొనసాగుతున్నాయి. కొత్తగా నిర్మించనున్న మూడో వంతెన ఈ రెండు బ్రిడ్జిల పక్కనే ఏర్పాటు కానుంది.

ఈ వంతెన అందుబాటులోకి వస్తే గుంటూరు, తెనాలి వైపు నుంచి వచ్చే రైళ్లకు మరింత సౌలభ్యం కలగనుంది. ప్రస్తుతం కొన్ని రైళ్లు కృష్ణా కెనాల్ రైల్వే స్టేషన్ వద్ద ఆగాల్సి వస్తుండగా.. కొత్త బ్రిడ్జి పూర్తయితే నేరుగా విజయవాడ రైల్వే స్టేషన్‌కు చేరుకునే అవకాశం ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

అలాగే విజయవాడ మీదుగా రాకపోకలు సాగించే గూడ్స్ రైళ్లకు కూడా అదనపు మార్గం అందుబాటులోకి వస్తుంది. దీంతో రైళ్ల రద్దీ తగ్గి, ప్రయాణ సమయాల్లో జాప్యం తగ్గే అవకాశం ఉంది.

ఏపీలో మరో రెండు రైల్వే బ్రిడ్జిల నిర్మాణం

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా నదిపై మరో రెండు రైల్వే వంతెనల నిర్మాణానికి కూడా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. అమరావతి-నంబూరు మధ్య కొత్త రైల్వే లైన్ ప్రాజెక్టులో భాగంగా అమరావతికి సమీపంలో కృష్ణా నదిపై వంతెన నిర్మించనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే టెండర్లు ఆహ్వానించారు.

అలాగే విజయవాడ బైపాస్ రైల్వే లైన్‌లో భాగంగా చోడవరం వద్ద కూడా కృష్ణా నదిపై మరో రైల్వే వంతెన నిర్మిస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టులకు కలిపి సుమారు రూ.3,197 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం.

ప్రస్తుతం ఈ ప్రాజెక్టులు టెండర్ల దశలో ఉన్నాయి. టెండర్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Live Updates in DTV Digital

రైల్వే కనెక్టివిటీకి మరింత ఊతం

విజయవాడలో మూడో రైల్వే బ్రిడ్జితో పాటు అమరావతి, చోడవరం ప్రాంతాల్లో కొత్త వంతెనలు అందుబాటులోకి వస్తే ఏపీలో రైల్వే కనెక్టివిటీ మరింత మెరుగుపడనుంది. ముఖ్యంగా విజయవాడ మీదుగా ప్రయాణించే రైళ్ల రద్దీ తగ్గడంతో పాటు అమరావతికి రైళ్ల రాకపోకలు సులభతరం కానున్నాయి. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ప్రయాణికులతో పాటు సరుకు రవాణా రంగానికి కూడా ప్రయోజనం కలగనుంది.