
స్థానిక ఎన్నికల కౌంటింగ్ వేళ పల్నాడు జిల్లాలో ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. సత్తెనపల్లి మండలం కంకణాలపల్లిలో ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఓటర్లు బ్యాలెట్ బాక్సుల్లో ఓట్లతోపాటు గ్రామ సమస్యలను వివరిస్తూ పాంప్లెట్లు కూడా వేశారు. తమ గ్రామంలో నిర్మించనున్న రైల్వే అండర్‌పాస్‌పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లేందుకు ఈ వినూత్న మార్గాన్ని ఎంచుకున్నారు.https://dtvandhrapradesh.com
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటల నుంచి కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోటీ నెలకొనగా, కంకణాలపల్లిలో మాత్రం బ్యాలెట్ బాక్సుల్లో కనిపించిన పాంప్లెట్లు ప్రత్యేక చర్చకు దారితీశాయి. వీటి సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆలస్యమైనట్లు సమాచారం.
గ్రామానికి నేరుగా ఉన్న రహదారిలోనే రైల్వే అండర్‌పాస్ నిర్మించాలని గ్రామస్తులు తమ పాంప్లెట్లలో కోరారు. ప్రతిపాదిత U ఆకారపు నిర్మాణం వల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామానికి ఉపయోగపడేలా ప్రస్తుత రహదారికి అనుసంధానంగా అండర్‌పాస్ నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమస్యను ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి నారా లోకేష్‌తోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే బ్యాలెట్ బాక్సుల్లో పాంప్లెట్లు వేసినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. తమ గ్రామ రహదారిని కాపాడాలని, నిర్మాణ ప్రణాళికను పునఃపరిశీలించాలని కోరారు.
ఓటు హక్కును వినియోగించుకుంటూనే తమ సమస్యను పాలకుల దృష్టికి తీసుకెళ్లేందుకు కంకణాలపల్లి గ్రామస్తులు చేసిన ఈ ప్రయత్నం చర్చనీయాంశంగా మారింది. ఈ విజ్ఞప్తిపై అధికారులు, ప్రజాప్రతినిధులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.
