
Dnews:nov:7రోజూ కడుపునిండా ఆహారం తీసుకుంటున్నా అలసట, నీరసం వెంటాడుతున్నాయా? అయితే మీరు తీసుకునే ఆహారంలో శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకం లోపిస్తోందేమో! అదే ప్రోటీన్.
చాలామంది ప్రోటీన్ అనేది కేవలం జిమ్‌కు వెళ్లేవారికి, కండలు పెంచుకోవాలనుకునే వారికే అవసరమని భావిస్తుంటారు. కానీ అది అపోహ మాత్రమే. జుట్టు మొదలుకొని గోళ్ల వరకు, కండరాల నుంచి శరీరంలోని ప్రతి కణం పనితీరు వరకు ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది.
మరి మన శరీర బరువును బట్టి రోజుకు ఎంత మొత్తంలో ప్రోటీన్ తీసుకోవాలి? ఏయే ఆహార పదార్థాల ద్వారా రోజువారీ ప్రోటీన్ అవసరాలను తీర్చుకోవచ్చు? ఇప్పుడు తెలుసుకుందాం!
మన శరీర ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలక పాత్ర పోషించే పోషకాలలో ప్రోటీన్ (మాంసకృత్తులు) ముఖ్యమైనది. అయితే చాలామంది ప్రోటీన్ అవసరాన్ని పూర్తిగా గుర్తించడం లేదు. బరువు తగ్గాలనుకున్నప్పుడు లేదా జిమ్‌కు వెళ్లి కండరాలను పెంచుకోవాలనుకున్నప్పుడు మాత్రమే ప్రోటీన్‌పై దృష్టి పెడుతున్నారు. కానీ వాస్తవానికి శరీరంలోని ప్రతి కణం నిర్మాణం, కణజాలాల మరమ్మత్తు, రోగనిరోధక శక్తి, జీవక్రియలు సక్రమంగా పనిచేయడానికి ప్రోటీన్ నిరంతరం అవసరం. అందుకే రోజువారీ ఆహారంలో తగినంత ప్రోటీన్ ఉండేలా చూసుకోవడం ఎంతో ముఖ్యం.
పోషకాహార నిపుణురాలు గీతికా చోప్రా వివరాల ప్రకారం.. ప్రోటీన్ కేవలం కండరాల నిర్మాణానికే పరిమితం కాదు. శరీరంలో దెబ్బతిన్న కణజాలాలను తిరిగి బాగుచేయడం, రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడం, హార్మోన్లు, ఎంజైమ్‌ల ఉత్పత్తి, పనితీరును నియంత్రించడంలోనూ ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
వయసును బట్టి శరీరానికి అవసరమయ్యే ప్రోటీన్ పరిమాణం మారుతుంది. చిన్నారుల్లో శారీరక ఎదుగుదలకు, టీనేజర్లలో కండరాలు, కణజాలాల అభివృద్ధికి, పెద్దవారిలో కండరాల సంరక్షణతో పాటు శరీర కణజాలాల పునరుద్ధరణకు ప్రోటీన్ అవసరం. కాబట్టి ప్రతి వయసు వారు తమ ఆహారంలో తగిన మోతాదులో ప్రోటీన్ ఉండేలా జాగ్రత్తపడాలి.
ప్రోటీన్ తీసుకునే విషయంలో చాలామందికి సరైన అవగాహన ఉండదు. ముఖ్యంగా ఆహార పదార్థం మొత్తం బరువును, అందులో ఉండే ప్రోటీన్ పరిమాణాన్ని ఒకటిగా భావిస్తుంటారు. కానీ ఈ రెండింటికీ చాలా తేడా ఉంటుంది.
ఉదాహరణకు, ఒక సాధారణ కోడిగుడ్డు బరువు సుమారు 60 గ్రాములు ఉంటుంది. అయితే దాని నుంచి శరీరానికి లభించే ప్రోటీన్ కేవలం 6 నుంచి 8 గ్రాములు మాత్రమే. అంటే 60 గ్రాముల బరువున్న గుడ్డు తిన్నంత మాత్రాన 60 గ్రాముల ప్రోటీన్ శరీరానికి అందినట్లు కాదు.
అందువల్ల మనం తీసుకునే ఆహార పదార్థాల బరువుతో పాటు వాటిలో వాస్తవంగా ఎంత ప్రోటీన్ లభిస్తుందో తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం.
