
D news:nov:15సెలబ్రిటీ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ ర్యాన్ ఫెర్నాండో తన ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో తెలిపిన వివరాల ప్రకారం.. చలికాలంలో బాదం తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన పలు పోషకాలు అందుతాయి. వీటిలో ఉండే పోషకాలు సాధారణ జీవక్రియలకు, రోగనిరోధక వ్యవస్థ పనితీరుకు తోడ్పడతాయి. బాదంపప్పును రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తినవచ్చు. లేదంటే బాదం పొడిని తయారు చేసుకుని పాలలో కలిపి కూడా తీసుకోవచ్చు.
పొట్టుతో తినాలా? పొట్టు తీసి తినాలా?
చాలామంది బాదంపప్పుపై ఉండే పొట్టును తొలగించి తినడానికి ఇష్టపడతారు. అయితే బాదాన్ని పొట్టుతో సహా తీసుకోవడం వల్ల కూడా మంచి ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా ఇందులోని ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు శరీర ఆరోగ్యానికి ఉపయోగపడతాయి.
బాదంలో విటమిన్ ఇ, కాల్షియం, ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి పోషకాలు ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యం, చర్మ ఆరోగ్యం, శరీర సాధారణ విధులకు తోడ్పడతాయి. సమతుల్య ఆహారంలో భాగంగా బాదం తీసుకోవడం వల్ల అవసరమైన పోషకాలను పొందవచ్చు.
రోజుకు ఎన్ని బాదం పప్పులు తినాలి?
బాదం ఆరోగ్యానికి మంచిదని ఎక్కువ మొత్తంలో తినకూడదు. నిపుణుల సూచనల ప్రకారం మోతాదును పాటించడం ముఖ్యం.
- ఇప్పటికే బాదం తినే అలవాటు ఉన్నవారు రోజుకు సుమారు 20 నుంచి 25 గ్రాముల వరకు తీసుకోవచ్చు.
- కొత్తగా బాదం తినడం ప్రారంభించేవారు రోజుకు 6 నుంచి 10 పప్పులతో మొదలుపెట్టవచ్చు.
- జీర్ణక్రియ, శరీర స్పందనను బట్టి తీసుకునే పరిమాణాన్ని నిర్ణయించుకోవాలి.
బాదంలో కేలరీలు, కొవ్వులు కూడా అధికంగా ఉంటాయి కాబట్టి మితంగా తీసుకోవడం మంచిది.
బాదం తినేటప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
కొంతమందికి బాదం తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు లేదా అలర్జీ లక్షణాలు కనిపించవచ్చు. ముఖ్యంగా బాదం అలర్జీ ఉన్నవారు వీటిని పూర్తిగా నివారించాలి. కొత్తగా ఆహారంలో చేర్చుకునేవారు తక్కువ పరిమాణంతో ప్రారంభించడం మంచిది.
గమనిక: బాదం పోషకాలు సమృద్ధిగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారం. అయితే బాదం ఒక్కటే రోగనిరోధక శక్తిని పెంచుతుందని భావించకూడదు. ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల్య ఆహారం, తగినంత నిద్ర, క్రమం తప్పని వ్యాయామం కూడా ఎంతో అవసరం.
