
దేశీయ ఆరోగ్య సంరక్షణ రంగంలో మరో భారీ కొనుగోలు ఒప్పందానికి రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అమెరికాకు చెందిన ప్రముఖ అసెట్ మేనేజ్మెంట్ సంస్థ బ్లాక్‌స్టోన్ పెట్టుబడులున్న ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్.. భారత్‌లో తన వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా కర్ణాటక కేంద్రంగా పనిచేస్తున్న నారాయణ హృదయాలయకు చెందిన ఉత్తర భారత ఆసుపత్రులను కొనుగోలు చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
ఈ ప్రతిపాదిత ఒప్పందం విలువ 150 మిలియన్ డాలర్లు (రూ.1,250 కోట్లకు పైగా) ఉండొచ్చని అంచనా. అయితే చర్చలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయని, ఒప్పందం ఖరారు కావచ్చు లేదా విఫలం కావచ్చని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. దీనిపై స్పందించేందుకు ఆస్టర్ డీఎం, బ్లాక్‌స్టోన్ ప్రతినిధులు నిరాకరించారు.
ఆస్టర్ డీఎంలో బ్లాక్‌స్టోన్‌కు 30 శాతం వాటా
ఆస్టర్ డీఎం క్వాలిటీ కేర్‌లో బ్లాక్‌స్టోన్‌కు సుమారు 30 శాతం వాటా ఉంది. ప్రపంచవ్యాప్తంగా తమకు అత్యంత ప్రాధాన్యమున్న పది పెట్టుబడుల్లో ఆస్టర్ డీఎం కూడా ఒకటని బ్లాక్‌స్టోన్ గతంలో వెల్లడించింది. కొనుగోళ్ల ద్వారా కొత్త మార్కెట్లలోకి ప్రవేశించడం, కార్యకలాపాలను విస్తరించడం తమ వ్యాపార వృద్ధి ప్రణాళికలో భాగమని ఆస్టర్ డీఎం ఇప్పటికే స్పష్టం చేసింది.
ఉత్తర భారత మార్కెట్‌పై నారాయణ హృదయాలయ వ్యాఖ్యలు
నారాయణ హృదయాలయ వైస్ ఛైర్మన్ వీరేన్ శెట్టి గతంలో ఉత్తర భారతదేశంలో తమ వ్యాపార విస్తరణపై కీలక వ్యాఖ్యలు చేశారు. మార్కెట్లో వస్తున్న ఊహాగానాలపై స్పందించలేమని చెబుతూనే.. ఉత్తర భారత మార్కెట్లో పోటీ తీవ్రంగా ఉందని పేర్కొన్నారు.
ఆ ప్రాంతంలోకి తాము ఆలస్యంగా ప్రవేశించామని, ఇప్పటికే ఇతర ఆసుపత్రుల సంస్థలు వేగంగా విస్తరిస్తుండటంతో గట్టి పోటీ ఎదురవుతోందని వివరించారు. క్యాన్సర్ వంటి సంక్లిష్ట వ్యాధుల చికిత్సలో తమకు ప్రత్యేక నైపుణ్యం ఉన్నప్పటికీ, ప్రత్యర్థి సంస్థల విస్తరణ వ్యూహాలు సవాలుగా మారుతున్నాయని అభిప్రాయపడ్డారు.
హెల్త్‌కేర్ రంగంలో భారీగా విదేశీ పెట్టుబడులు
భారత ఆరోగ్య సంరక్షణ రంగంపై అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలు ఆసక్తి పెంచుకుంటున్నాయి. గత ఐదేళ్లలో బ్లాక్‌స్టోన్, కేకేఆర్, టీపీజీ, అడ్వెంట్ ఇంటర్నేషనల్, జనరల్ అట్లాంటిక్, సింగపూర్‌కు చెందిన టెమాసెక్ హోల్డింగ్స్ వంటి సంస్థలు కలిపి 10 బిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ.95,000 కోట్లు) పెట్టుబడులు పెట్టాయి.
ఆసుపత్రుల విస్తరణ, ఆధునిక వైద్య సదుపాయాలు, ప్రత్యేక చికిత్సా కేంద్రాలకు పెరుగుతున్న డిమాండ్ ఈ రంగంలో పెట్టుబడులకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. ఆస్టర్ డీఎం-నారాయణ హృదయాలయ మధ్య చర్చలు ఒప్పందంగా మారితే భారత ఆసుపత్రుల రంగంలో మరో కీలక పరిణామం చోటుచేసుకోనుంది.
