నీట్‌-యూజీ పేపర్‌ లీక్‌ వ్యవహారంపై సీజేపీ ఆధ్వర్యంలో జూలై 20న విద్యార్థులు చేపట్టిన ‘చలో పార్లమెంట్‌’ ఉద్రిక్తతలకు దారితీసింది. నిరసనలను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీఛార్జ్‌ చేయడంతో పాటు పెల్లెట్లు, వాటర్‌ క్యానన్లను ప్రయోగించారు. ఆందోళనలో పాల్గొన్న పలువురు నిరసనకారులపై ఎఫ్‌ఐఆర్‌లు కూడా నమోదు చేశారు.

అయితే, ఈ కేసులను రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్వం సీజేపీతో జరిగిన చర్చల సందర్భంగా హామీ ఇచ్చింది. నెల రోజులు గడిచినా హామీ అమలు కాకపోవడంతో.. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు సెప్టెంబర్‌ 5న మరోసారి మార్చ్‌ చేపట్టాలని సీజేపీ పిలుపునిచ్చింది.

ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజాగా కీలక నిర్ణయం తీసుకుంటూ విద్యార్థులు, నిరసనకారులపై నమోదైన కేసులను రద్దు చేసింది. దీంతో సీజేపీ చేపట్టనున్న మార్చ్‌కు ముందే కేసుల వ్యవహారానికి తెరపడింది.

నీట్‌-యూజీ ప్రశ్నాపత్రం లీక్‌కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో జరిగిన నిరసనల్లో పాల్గొని కేసులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు సుప్రీంకోర్టు భారీ ఊరట కల్పించింది. ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసింది.

అయితే, నేర చరిత్ర ఉన్న వ్యక్తులకు ఈ మినహాయింపు వర్తించదని స్పష్టం చేసింది. జూలై 20 నుంచి 25 మధ్యకాలంలో ఆందోళనకారులపై నమోదైన కేసులన్నింటినీ కొట్టివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో విద్యార్థులపై నమోదైన కేసులను ఉపసంహరించుకోవాలని మంగళవారం సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఈ నేపథ్యంలో సెప్టెంబరు 5న నిర్వహించాల్సిన మార్చ్‌ను రద్దు చేస్తున్నట్లు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ప్రకటించింది. జులై 20న జరిగిన సీజేపీ నిరసనకు సంబంధించి నమోదైన కేసులను ఉపసంహరించుకుంటామని, అలాగే భవిష్యత్తులో అదే నిరసనకు సంబంధించి కొత్త కేసులు నమోదు చేయబోమని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన తర్వాత ఈ నిర్ణయం వెలువడింది.

అయితే, జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల్లో పాల్గొన్న 2,873 మందిలో తీవ్రమైన నేర చరిత్ర ఉన్నవారిపై ఒక ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేందుకు ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది.

కేంద్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడంతో పాటు సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో సెప్టెంబరు 5న చేపట్టాల్సిన నిరసనను ఉపసంహరించుకోవాలని తమ బృందం నిర్ణయించుకున్నట్లు సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ సుప్రీంకోర్టుకు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. విద్యార్థుల నిరసనలకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లను రద్దు చేయాలని కేంద్రంతో పాటు బిహార్, అస్సాం, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర ప్రభుత్వాలు దరఖాస్తులు దాఖలు చేశాయని ఆయన కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా, జులై 20 నుంచి 25 వరకు జరిగిన నిరసనలకు సంబంధించిన ఘటనలపై భవిష్యత్తులో ఎలాంటి కొత్త ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయబోమని కేంద్రం హామీ ఇచ్చిందని వెల్లడించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *