ప్రస్తుతం సోషల్ మీడియాలో నిమ్మకాయ వాటర్, కీరా-పుదీనా వాటర్, దాల్చినచెక్క వాటర్ వంటి వివిధ రకాల ‘డీటాక్స్ డ్రింక్స్‌’కు విపరీతమైన ప్రచారం లభిస్తోంది. వీటిని తాగితే శరీరంలోని టాక్సిన్లు బయటకు వెళ్లిపోతాయని, పొట్ట కొవ్వు కరిగి బానపొట్ట తగ్గుతుందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది? డీటాక్స్ వాటర్ నిజంగా శరీరాన్ని ‘క్లీన్’ చేస్తుందా? లేక ఇది కేవలం సోషల్ మీడియా ట్రెండ్ మాత్రమేనా? శాస్త్రీయ ఆధారాలు ఏం చెబుతున్నాయి, ఈ డ్రింక్స్ వల్ల నిజంగా కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

డీటాక్స్ వాటర్ గురించి సోషల్ మీడియాలో ఎన్నో ప్రచారాలు జరుగుతున్నప్పటికీ.. మన శరీరానికి వ్యర్థాలను బయటకు పంపే సహజమైన వ్యవస్థ ఇప్పటికే ఉంది. లివర్, కిడ్నీలు, ఊపిరితిత్తులు, జీర్ణవ్యవస్థ నిరంతరం పనిచేస్తూ శరీరంలోని వ్యర్థ పదార్థాలను తొలగించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కిడ్నీలు రక్తాన్ని వడపోసి మూత్రం ద్వారా వ్యర్థాలను బయటకు పంపుతాయి. ఊపిరితిత్తులు శ్వాస ద్వారా కార్బన్ డయాక్సైడ్‌ను తొలగిస్తాయి. కాలేయం వివిధ పదార్థాలను ప్రాసెస్ చేసి శరీరం నుంచి బయటకు పంపే ప్రక్రియలో భాగస్వామ్యం అవుతుంది. అందువల్ల డీటాక్స్ వాటర్ తాగగానే శరీరంలోని టాక్సిన్లు కరిగిపోతాయని చెప్పడానికి తగిన శాస్త్రీయ ఆధారాలు లేవు.

అయితే నిమ్మ, కీరా, పుదీనా వంటి పదార్థాలను కలిపిన నీటిని తాగడం వల్ల కొన్ని సాధారణ ప్రయోజనాలు ఉండొచ్చు. సాధారణ నీరు తాగడం ఇష్టం లేని వారికి మంచి రుచి రావడంతో ఎక్కువ నీరు తాగే అలవాటు ఏర్పడుతుంది. అలాగే కూల్‌డ్రింక్స్, చక్కెర కలిగిన ప్యాకేజ్డ్ జ్యూస్‌లకు బదులుగా ఇలాంటి నీటిని ఎంచుకుంటే అదనపు కేలరీలను తగ్గించుకోవచ్చు.

శరీరానికి తగినంత నీరు అందడం వల్ల డీహైడ్రేషన్‌ను నివారించడంతో పాటు మలబద్ధకం వంటి సమస్యలు తగ్గేందుకు సహాయపడుతుంది. అయితే డీటాక్స్ వాటర్ నేరుగా పొట్టలోని కొవ్వును కరిగించదు. బరువు తగ్గడానికి సమతుల్య ఆహారం, క్రమం తప్పని శారీరక వ్యాయామం, తగిన నిద్ర వంటి జీవనశైలి మార్పులు అవసరం. పండ్లను నీటిలో నానబెట్టినంత మాత్రాన.. ఆ పండును నేరుగా తినడం ద్వారా లభించే ఫైబర్, పోషకాలు పూర్తిగా నీటిలోకి చేరవు.

అలాగే డీటాక్స్ వాటర్ థైరాయిడ్, డయాబెటిస్, ఫ్యాటీ లివర్ వంటి వ్యాధులకు చికిత్స కాదు. తీవ్రమైన ఎసిడిటీ లేదా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు నిమ్మ వంటి సిట్రస్ పదార్థాలతో తయారు చేసిన నీటిని తీసుకుంటే కొందరిలో మంట పెరిగే అవకాశం ఉంది. కిడ్నీ సమస్యలు ఉన్నవారు రోజువారీగా ఎంత నీరు తీసుకోవాలో వైద్యుల సూచన మేరకు నిర్ణయించుకోవడం మంచిది. మొత్తంగా చూస్తే.. డీటాక్స్ వాటర్‌ను ఆరోగ్యకరమైన నీటి ప్రత్యామ్నాయంగా చూడొచ్చు కానీ, దాన్ని ‘మ్యాజిక్ డీటాక్స్ డ్రింక్’గా భావించడం సరైంది కాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *