గుండె ఆరోగ్యం గురించి మాట్లాడితే చాలామందికి ఛాతినొప్పి, ఆయాసం వంటి సమస్యలే గుర్తుకొస్తాయి. అయితే గుండె ఆరోగ్యంగా, సమర్థంగా పనిచేస్తుందనే విషయాన్ని సూచించే కొన్ని సానుకూల సంకేతాలు కూడా మన శరీరంలో కనిపిస్తాయి. నిమిషానికి గుండె కొట్టుకునే వేగం నుంచి నడక లేదా వ్యాయామం సమయంలో శరీరంలో వచ్చే మార్పుల వరకు.. గుండె పనితీరు బాగుందని సూచించే ఈ ముఖ్యమైన సంకేతాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

గుండె ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవడానికి కొన్ని సాధారణ సంకేతాలను గమనించవచ్చు. విశ్రాంతి సమయంలో హార్ట్‌బీట్ కూడా అందులో ముఖ్యమైనది. ఢిల్లీలోని మెదాంతా మూల్‌చంద్ ఆసుపత్రి కార్డియాలజీ ప్రొఫెసర్ డాక్టర్ తరుణ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రిలాక్స్డ్గా ఉన్న సమయంలో గుండె నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకోవడం సాధారణంగా పరిగణిస్తారు. అయితే క్రమం తప్పకుండా వ్యాయామం చేసే, శారీరకంగా ఫిట్‌గా ఉండే వ్యక్తుల్లో హార్ట్‌రేట్ 60 కంటే తక్కువగా ఉన్నా అది సాధారణమే కావచ్చు.
గుండె పనితీరును అంచనా వేయడంలో రక్తపోటు కూడా కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా 120/80 mmHg బీపీని ఆరోగ్యకరమైన స్థాయిగా పరిగణిస్తారు. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన వారు క్రమం తప్పకుండా బీపీని పరీక్షించుకోవడం మంచిది. అలాగే వేగంగా నడిచినప్పుడు లేదా మెట్లు ఎక్కినప్పుడు అసాధారణమైన ఆయాసం, ఛాతీలో అసౌకర్యం లేకుండా ఉండగలగడం కూడా మంచి గుండె సామర్థ్యానికి సూచనగా భావించవచ్చు.
వ్యాయామం లేదా ఇతర శారీరక శ్రమ సమయంలో హార్ట్‌బీట్ పెరగడం సహజమే. అయితే వ్యాయామం పూర్తయిన తర్వాత కొద్దిసేపట్లోనే పల్స్ రేట్ క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంటే, శరీరం శ్రమ నుంచి వేగంగా కోలుకుంటోందని అర్థం. ఇది మంచి కార్డియోవాస్కులర్ ఫిట్‌నెస్‌కు సంకేతంగా ఉండవచ్చు.
రోజువారీ పనులు లేదా శారీరక శ్రమ చేస్తున్నప్పుడు ఛాతీలో నొప్పి, బిగుతు, ఒత్తిడి లేదా అసౌకర్యం లేకపోవడం కూడా గుండె ఆరోగ్యానికి అనుకూలమైన సంకేతం. అయితే ఛాతీలో నొప్పి లేదా అసౌకర్యం కనిపిస్తే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం చాలా ముఖ్యం. కారణం లేకుండా కాళ్లు, చీలమండలు లేదా పాదాల్లో వాపులు రావడం కూడా గమనించాల్సిన అంశమే.
అయితే ఈ లక్షణాలు ఉన్నంత మాత్రాన గుండె పూర్తిగా ఆరోగ్యంగా ఉందని నిర్ధారించలేం. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సమతుల్య ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడం, బీపీ, బ్లడ్ షుగర్, కొలెస్ట్రాల్ వంటి వాటిని నియంత్రణలో ఉంచుకోవడం అవసరం. శరీరంలో ఏవైనా అసాధారణ లక్షణాలు కనిపిస్తే సొంతంగా నిర్ణయాలు తీసుకోకుండా వైద్య నిపుణులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవడం మంచిది.
