వినాయక చవితి పండుగ సందర్భంగా బొజ్జ గణపయ్యకు సమర్పించే నైవేద్యాలలో పూర్ణం కుడుములకు ప్రత్యేక స్థానం ఉంది. సంప్రదాయ పద్ధతిలో తయారు చేసే ఈ స్వీట్‌ ఎంతో రుచికరంగా ఉంటుంది. అయితే సరైన కొలతలు, తయారీ విధానం పాటిస్తే పూర్ణం కుడుములను ఇంట్లోనే ఎంతో సులభంగా తయారు చేసుకోవచ్చు. మరి ఈ వినాయక చవితికి రుచికరమైన పూర్ణం కుడుములు తయారు చేసేందుకు కావాల్సిన పదార్థాలు ఏంటి? వాటిని ఎలా తయారు చేయాలి? ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

పూర్ణం కుడుములు తయారు చేసేందుకు ముందుగా అవసరమైన పదార్థాలను సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం అర కప్పు శెనగపప్పు, అర కప్పు బియ్యం పిండి, అర కప్పు తురిమిన బెల్లం, రెండు గ్లాసుల నీళ్లు, ఒక టేబుల్‌స్పూన్ నెయ్యి, పావు టేబుల్‌స్పూన్ ఉప్పు, రెండు టేబుల్‌స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము, అర టీస్పూన్ యాలకుల పొడి తీసుకోవాలి.

తయారీ విషయానికి వస్తే.. ముందుగా శెనగపప్పును మూడు గంటల పాటు నానబెట్టి, శుభ్రంగా కడిగి కుక్కర్‌లోకి తీసుకోవాలి. ఒక కప్పు నీళ్లు పోసి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. పప్పు మెత్తగా ఉడికిన తర్వాత నీటిని వడకట్టి, పప్పును మాత్రమే మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాన్‌లో వేసి, అందులో తురిమిన బెల్లం కలిపి చిన్న మంటపై ఉడికించాలి. బెల్లం కరిగి మిశ్రమం దగ్గరపడుతున్నప్పుడు నెయ్యి, కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి బాగా కలపాలి. మిశ్రమం ముద్దగా మారిన తర్వాత స్టవ్ ఆపి చల్లారనివ్వాలి. అనంతరం చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి.

ఇక కుడుముల బయటి పొర కోసం పాన్‌లో ఒక కప్పు నీళ్లు పోసి, కొద్దిగా ఉప్పు, నెయ్యి వేసి మరిగించాలి. నీళ్లు మరిగిన తర్వాత మంట తగ్గించి బియ్యం పిండి వేసి గరిటతో బాగా కలపాలి. పిండి దగ్గరపడిన తర్వాత మూత పెట్టి రెండు, మూడు నిమిషాలు ఉడికించాలి. చల్లారిన తర్వాత చేతితో మెత్తగా నలిపి ముద్దలా చేసుకోవాలి. పిండి ఆరిపోకుండా తడి వస్త్రంతో కప్పి ఉంచాలి.

తర్వాత బియ్యం పిండి ముద్దను చిన్న భాగాలుగా తీసుకుని పల్చగా వత్తి, మధ్యలో సిద్ధం చేసుకున్న పూర్ణం ఉండను పెట్టాలి. పిండితో పూర్ణాన్ని పూర్తిగా మూసి కుడుముల్లా చుట్టుకోవాలి. ఇదే విధంగా అన్ని కుడుములను సిద్ధం చేసుకోవాలి. చివరగా స్టీమర్ లేదా ఇడ్లీ పాత్రలో నీళ్లు మరిగించి, ప్లేట్‌కు కొద్దిగా నెయ్యి రాసి కుడుములను పేర్చాలి. మధ్యస్థ మంటపై సుమారు 15 నిమిషాలు ఆవిరితో ఉడికిస్తే రుచికరమైన పూర్ణం కుడుములు సిద్ధమవుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *