
నర్సాపురం, D news: పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం మండలం సీతారాంపురంలోని స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాల మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కళాశాలలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ (AI & ML) విభాగం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
వినాయక చవితి సందర్భంగా పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులుగా మట్టి గణపతి విగ్రహాలను వినియోగించాలని కళాశాల ప్రతినిధులు పిలుపునిచ్చారు. “మట్టి వినాయకుడు ముద్దు.. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వినాయకుడు వద్దు” అంటూ నినాదాలు చేస్తూ పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.
రసాయనిక రంగులతో తయారు చేసిన విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమయ్యే అవకాశం ఉందని, పర్యావరణానికి హాని కలిగించే విగ్రహాలను వినాయక చవితి పందిళ్లలో ఉపయోగించకుండా సహజసిద్ధమైన మట్టి విగ్రహాలను పూజించాలని సూచించారు.
ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ కె.వి. సత్యనారాయణ, ట్రెజరర్ కే. వెంకటేశ్వర స్వామి, డైరెక్టర్ అడ్డాల శ్రీహరి, కళాశాల మెంబర్ పి. వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్ ఏ. గోపీచంద్, AI & ML విభాగాధిపతి బొమ్మ రామకృష్ణ మాట్లాడుతూ.. పండుగల సంప్రదాయాలను కాపాడుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు.
అనంతరం AI & ML విభాగంలోని అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులకు మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. పర్యావరణహిత వినాయక చవితిని జరుపుకోవాలని స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాల పిలుపునిచ్చింది.
