విఘ్నాలను తొలగించే దేవుడిగా వినాయకుడిని హిందువులు కొలుస్తారు. ఏ శుభకార్యం ప్రారంభించినా ముందుగా గణపతిని పూజించడం ఆనవాయితీ. అందుకే వినాయకచవితిని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ ఏడాది కూడా రాష్ట్రవ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.

వినాయకచవితి సందర్భంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఓ ప్రత్యేక గణపతి విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. బీచ్‌రోడ్డులోని గోకుల్ పార్క్ వద్ద కోటి రుద్రాక్షలతో 20 అడుగుల ఎత్తైన వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. యూత్ ఐకాన్ ఆధ్వర్యంలో సీరాపు రాజు, ఆయన బృందం ఈ విగ్రహాన్ని రూపొందించింది.

ఈ విగ్రహం కోసం నేపాల్, కేదార్‌నాథ్, బద్రీనాథ్ తదితర ప్రాంతాల నుంచి రుద్రాక్షలను ప్రత్యేకంగా తీసుకొచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. కోటి రుద్రాక్షలతో రూపొందించిన గణపయ్యను దర్శించుకోవడం ద్వారా భక్తులకు ప్రత్యేక ఆధ్యాత్మిక అనుభూతి కలిగించాలనే ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 21 రోజుల పాటు భక్తులకు దర్శన అవకాశం కల్పిస్తున్నారు.

గణేశ్ రుద్రాక్షపై ప్రత్యేక నమ్మకాలు

సహజంగా ఏనుగు తొండాన్ని పోలిన ఆకారం కలిగిన రుద్రాక్షను ‘గణేశ్ రుద్రాక్ష’గా పిలుస్తారు. దీనిని వినాయకుడికి ప్రతీకగా భావిస్తారు. గణేశ్ రుద్రాక్షను ధరించడం వల్ల ఆటంకాలు తొలగి, జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, మానసిక ప్రశాంతత పెరుగుతాయని భక్తుల్లో నమ్మకం ఉంది.

సంపద, శ్రేయస్సు, అదృష్టం కలిసివస్తాయని కూడా జ్యోతిష్య నమ్మకాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏకంగా కోటి రుద్రాక్షలతో రూపొందించిన గణపతి విగ్రహాన్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

విశాఖ బీచ్‌రోడ్డులో కొలువుదీరిన కోటి రుద్రాక్షల గణపయ్యపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.

By Ramya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *